లోకసభ ఎన్నికల పోలింగ్ కేంద్రాల వారీగా పారదర్శకంగా ఈవిఎం యంత్రాల కేటాయింపు పూర్తి చేసినట్లు ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఖమ్మం లోకసభ ఎన్నికల సాధారణ పరిశీలకులు డా. సంజయ్ జి కోల్టే తో కలిసి ఈవిఎం యంత్రాల రెండవ దశ ర్యాండమైజేషన్ ప్రక్రియ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఖమ్మం పార్లమెంటు పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ సెగ్మెంట్ ల వారీగా మొదటి దశలో ఈవిఎం యంత్రాలను సంబంధిత జిల్లా ఎన్నికల అధికారులు మొదటి దశ ర్యాండమైజేషన్ ప్రక్రియ ద్వారా కేటాయించడం జరిగిందని అన్నారు. రెండవ దశ ర్యాండమైజేషన్ ప్రక్రియలో అసెంబ్లీ సెగ్మెంట్లకు కేటాయించిన ఈవీఎం యంత్రాలను పోలింగ్ కేంద్రాల వారీగా పారదర్శకంగా ఆన్ లైన్ సాఫ్ట్ వేర్ ఉపయోగించి కేటాయించడం జరిగిందని రిటర్నింగ్ అధికారి తెలిపారు.
రెండవ దశ ర్యాండమైజేషన్ ప్రక్రియలో పోలింగ్ కేంద్రాలకు కేటాయించిన ఈవీఎం యంత్రాలు, అదేవిధంగా అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా కేటాయించిన రిజర్వ్ ఈవీఎం యంత్రాల వివరాలను రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందజేసినట్లు తెలిపారు. ఖమ్మం అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో ఉన్న 355 పోలింగ్ కేంద్రాలు, పాలేరు అసెంబ్లీ సెగ్మెంట్ లో 290, మధిర అసెంబ్లీ సెగ్మెంట్ లో 268, వైరా అసెంబ్లీ సెగ్మెంట్ లో 252, సత్తుపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ లో 294, కొత్తగూడెం అసెంబ్లీ సెగ్మెంట్ లో 253 పోలింగ్ కేంద్రాలు, అశ్వారావుపేట అసెంబ్లీ సెగ్మెంట్ లో 184 పోలింగ్ కేంద్రాలకు తలా 3 బ్యాలెట్ యూనిట్లు, 1 కంట్రోల్ యూనిట్, 1 వివిప్యాట్ లను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఆన్ లైన్ విధానం ద్వారా పారదర్శకంగా ర్యాండమైజేషన్ చేసి కేటాయించినట్లు తెలిపారు. రెండవ ర్యాండమైజేషన్ కు సంబంధించి హర్డ్ కాపీలు, సాఫ్ట్ కాపీలు రాజకీయ పార్టీల ప్రతినిధులకు రిటర్నింగ్ అధికారి అందించారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి కేటాయించిన ఈవిఎం యంత్రం మాత్రమే పోలింగ్ కు వినియోగించడం జరుగుతుందని, పోలింగ్ సమయంలో ఏజెంట్ సదరు వివరాలు సరి చూసుకోవచ్చని, ఈవిఎం యంత్రం మరమ్మత్తు గురైతే సదరు అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో రిజర్వులో ఉన్న ఈవిఎం యంత్రాలతో భర్తీ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం నగరపాలక సంస్థ కమీషనర్ ఆదర్శ్ సురభి, జిల్లా రెవిన్యూ అధికారిణి ఎం. రాజేశ్వరి, కలెక్టరేట్ ఎన్నికల సూపరింటెండెంట్ రాంబాబు, బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధి చీకటి రాంబాబు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి ఏ. గోపాల్ రావు, బిజెపి పార్టీ ప్రతినిధి జిఎస్ఆర్ఏ. విద్యాసాగర్, స్వతంత్ర అభ్యర్ధులు చిట్టిమల్లు, జోగ్రామ్, ఎం. రవిచందర్ చౌహాన్, పార్టీల, అభ్యర్థుల ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.