TEJA NEWS

తప్పిదాలకు తావులేకుండా పక్కాగా ఇంటింటి సర్వే…

-జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

-ఇంటింటి సర్వే సన్నద్ధతపై నియోజకవర్గ బాధ్యులతో సమీక్షించిన జిల్లా కలెక్టర్

ఉమ్మడి ఖమ్మం

రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి సంబంధించిన సామాజిక, ఆర్ధిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల వివరాల సేకరణకై ప్రభుత్వం ఈ నెల 6 వ తేదీ నుండి ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను జిల్లాలో పక్కాగా నిర్వహించేలా అన్ని చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఇంటింటి కుటుంబ సర్వేకు సంబంధించి నియోజకవర్గ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఆయా నివాస ప్రాంతాలలో ఇళ్ల జాబితాల రూపకల్పన త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. సర్వేకు కావాల్సిన ఎన్యుమరేటర్ల గుర్తింపు ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. సర్వేకు సంబంధించి బ్యాగులు, స్టేషనరీ సామాగ్రి సేకరణ వెంటనే పూర్తి చేయాలన్నారు.

ఏ ఒక్క నివాస గృహం సైతం మినహాయించబడకుండా పక్కా పరిశీలనతో హౌస్ లిస్టింగ్ చేయాలని, ఎలాంటి గందరగోళానికి తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ అన్నారు. ముఖ్యంగా మున్సిపల్ పట్టణాల పరిధిలో ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలన్నారు. సర్వే కోసం ఎన్యుమరేషన్ బ్లాక్ లోని ప్రతి ఇంటికి క్రమానుగత సంఖ్యను కేటాయించాలని, ఇళ్ల జాబితా పక్కాగా రూపొందితే సర్వే సమగ్రంగా చేపట్టబడుతుందని అన్నారు. నిర్దేశిత సర్వే ప్రణాళికను అనుసరిస్తూ మూడు రోజుల్లోపు హౌస్ లిస్టింగ్ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. ఎక్కడ కూడా డూప్లికేషన్ లేకుండా హౌస్ లిస్టింగ్ చేయాలని, ప్రభుత్వ మార్గదర్శకాలను తు.చ. తప్పకుండా పాటిస్తూ జిల్లాలో సర్వే ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.

ఈ నెల 6వ తేదీ నుండి ప్రారంభమయ్యే ఇంటింటి సమగ్ర సర్వే ప్రక్రియపై ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని అన్నారు. శిక్షణకు ఏర్పాట్లు చేయాలని అన్నారు. డాటా నమోదుకు ఆపరేటర్లను సిద్ధంగా ఉంచాలన్నారు. ప్రక్రియలో తప్పిదాలు జరగకుండా పర్యవేక్షణ అధికారులు అన్ని స్థాయిల్లో సూపర్ చెక్ చేపట్టాలని కలెక్టర్ అన్నారు.

ఈ సమీక్ష లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ, ముఖ్య ప్రణాళిక అధికారి ఏ. శ్రీనివాస్, డిప్యూటీ జెడ్పి సిఇఓ నాగలక్ష్మి, ఆర్డీవోలు నర్సింహారావు, రాజేందర్, జిల్లా వైద్య శాఖ అధికారి సోమశేఖరశర్మ, అదనపు డిఆర్డీవో నూరొద్దీన్, డివిజనల్ పంచాయతీ అధికారి రాంబాబు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS