తిరుమలలో అదనపు అన్నప్రసాద భవనం

WhatsApp Image 2025 08 22 at 5.53.53 PM
TEJA NEWS

తిరుమలలో అదనపు అన్నప్రసాద భవనం

** ఏర్పాటుకు పరిశీలనపై ఈఓ సూచనలు

తిరుమల: తిరుమలలో
ప్రస్తుతం ఉన్న మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో భక్తులు వేచి ఉండే సమయం ఎక్కువగా ఉన్నందున వేరొక ప్రాంతంలో కూడా అన్న ప్రసాద భవనం ఏర్పాటు చేసేందుకు పరిశీలించాలని టీటీడీ ఈఓ జె.శ్యామల రావు అధికారులను ఆదేశించారు. తిరుమలలోని అన్నమయ్య భవన్ లో ఉదయం అధికారులతో బ్రహ్మోత్సవాల్లో భక్తుల వసతి, ఇతర సౌకర్యాలపై ఈఓ సమీక్షించారు.
బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు వసతి, ఇతర సౌకర్యాలకు సంబంధించి ఇబ్బందులు తలెత్తకుండా తిరుమలలోని అన్ని గదులలో ఎలక్ట్రిక్ పనులు, మరుగుదొడ్లు, ఇతర రిపేర్లను సకాలంలో పూర్తి చేయాలని కోరారు. కొండపై పలు విశ్రాంతి గృహాలు, కాటేజీల మరమ్మతు పనులను రిసెప్షన్ విభాగంతో సమన్వయం చేసుకుని సకాలంలో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
యాత్రికుల వసతి సముదాయాల్లో కూడా సెంట్రలైజ్డ్ బుకింగ్ సిస్టమ్ అప్లికేషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు.
రాష్ట్ర ఆహార భద్రతా అధికారులతో తిరుమలలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, హోటళ్లలో ఆహార నాణ్యతను పరిశీలించాలన్నారు. అదేవిధంగా పంచాయతీ, రెవెన్యూ విభాగం ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, హోటళ్లలో ఏర్పాటు చేసిన ధరల పట్టికను పరిశీలించాలని కోరారు. తిరుమలలోని హోటళ్లలో భక్తులకు సాంప్రదాయ భోజనం అందించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. భక్తులు లడ్డూ ప్రసాదం తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తకుండా లడ్డూ ప్రసాద విక్రయ కేంద్రంలోని అన్ని కౌంటర్లు పని చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి నెలా నిర్వహించే ఫీడ్ బ్యాక్ సర్వే ద్వారా వచ్చే భక్తుల అభిప్రాయాలను, సలహాలు, సూచనలను పరిగణలోకి తీసుకుని ఎప్పటికప్పుడు మార్పుల చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, చీఫ్ ఇంజినీర్ సత్య నారాయణ, అన్నదానం డిప్యూటీ ఈఓ రాజేంద్ర కుమార్, డిప్యూటీ ఈఓలు కస్తూరిబాయి, వరలక్ష్మి, నాగరత్న, చీఫ్ పీఆర్వో రవి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

You cannot copy content of this page