TEJA NEWS

అసిస్టెంట్ ఇంజినీర్ అక్రమాస్తులు రూ. వంద కోట్లు !

ఆయన మంచి పొజిషన్‌లో లేరు. ఓ మాదిరి ఉద్యోగంలో ఉన్నారు. కానీ ఆయన అక్రమాస్తుల విలువ వంద కోట్లు. పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలే కొనుక్కోలేని చోట్ల ఫామ్ హౌస్లు, లెక్కలేనన్ని ఆస్తులు ఆయన సొంతం. ఆయన పేరు నిఖేష్ కుమార్. తెలంగాణ నీటి పారుదల శాఖలో ఓ అసిస్టెంట్ ఇంజినీరు. రూ. లక్ష లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిన తర్వాత సస్పెన్షన్ లో ఉన్నారు. ఇప్పుడు ఆయన ఇళ్లపై దాడిచేసి సోదాలు చేస్తే ఏసీబీ అధికారులకు వంద కోట్లకుపైగా అక్రమాస్తులు దొరికాయి.

ఎంత అసిస్టెంట్ ఇంజనీర్ అయితే మాత్రం ఇంత పెద్ద ఎత్తున లంచాలు ఇస్తారా అని ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. హైడ్రా లాంటి వ్యవస్థల్ని పెట్టాల్సి వచ్చేది ఇలాంటివారి నిర్వాకాల వల్లనే. నిఖేష్ కుమార్ గండిపేట బఫర్ జోన్, ఎఫ్‌టిఎల్‌లో నిబంధనకు విరుద్ధంగా భవనాలు, అపార్ట్‌మెంట్లు కట్టుకునేందుకు అనుమతులు ఇచ్చారు. గండిపేట, హిమాయత్ సాగర్, నార్సింగి, మణికొండ, రాజేంద్రనగర్ పరిధిలో భారీగా అక్రమాలకు పాల్పడ్డారు. అందరి దగ్గర నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేశారు.

నికేష్ పేరిట ఐదు ఇళ్లు, ఫామ్ హౌస్‌లు కూడా ఉన్నాయి. 6.5 ఎకరాల వ్యవసాయ భూమి, ఆరు ప్లాట్లు, రెండు కమర్షియల్ ప్లాట్లు ఉన్నట్లు గుర్తించారు. ఫామ్ హౌస్‌ల విలువ రూ.80 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. అయితే నిఖేష్ చేసిన అక్రమాల్లోఆయన వాటాకే ఇంత ఆస్తులు వస్తే ఇక పై అధికారులు ఎంత వెనకేసి ఉంటారన్న అనుమానాలు వస్తున్నాయి. మరి ఏసీబీ అధికారులు అలాంటి పనులు చేయగలుగుతారా ?


TEJA NEWS