TEJA NEWS

ఆటో మోటార్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

** సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ తిరుపతి కార్యదర్శి డిమాండ్

తిరుపతి: రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ముందు టీడీపీ కూటమి ప్రభుత్వం ఆటో మోటార్ కార్మికులకు ఎన్నికల హామీలను ఇచ్చిందని వాటన్నింటిని తక్షణం అమలు చేయాలని సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ తిరుపతి నగర కార్యదర్శి పి.వెంకటరత్నం డిమాండ్ చేశారు. ఎన్నికల హామీల అమలకు, ఆటో కార్మికుల డిమాండ్ల పరిష్కారం కోసం మంగళవారం (నేడు) రాష్ట్ర వ్యాప్తంగా ఐ.ఎఫ్.టి.యు అనుబంధ ఏపీ ప్రగతిశీల ఆటో మోటార్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాల నిర్వహణకు రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో సోమవారం తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ ఎదుట ఆందోళన కార్యక్రమాల కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని, వారి కుటుంబ సభ్యులకు, పిల్లల చదువులకు సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారన్నారు.

రవాణా రంగానికి ఉరితాడుగా వైసిపి ప్రభుత్వం తెచ్చిన జీవో నెంబర్ 21 రద్దు చేస్తామని, పెనాల్టీలు తగ్గిస్తామని హామీ ఇచ్చి ఇప్పటికి ఏడాది అవుతున్నా పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ఆటో, క్యాబ్, లారీ, ట్రక్కు ఇతర వాహనాల డ్రైవర్లు అందరికీ ప్రతి సంవత్సరం 15000 ఆర్థిక సహాయం చేస్తామని, పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను తగ్గిస్తామని ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదన్నారు. దీనికి నిరసనగా మంగళవారం ఉదయం 10 గంటలకు అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగే నిరసన కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఏపీ ప్రగతిశీల ఆటో మోటార్ వర్కర్స్ ఫెడరేషన్ తిరుపతి నగర ప్రధాన కార్యదర్శి కుడుం విజయ్ కుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యలు పరిష్కరిస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు. మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని తాము వ్యతిరేకించడం లేదని అదే సమయంలో ఆటో డ్రైవర్లు నష్టపోకుండా ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇప్పటివరకు మోటార్ కార్మికులకు ఇచ్చిన హామీలు ఒకటి కూడా అమలు కాలేదని ఇది వారిని నమ్మించి మోసం చేయడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం ఈ డిమాండ్ల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం సానుకూలంగా స్పందించి అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కిషోర్, మస్తానయ్య, శీనయ్య, చాంద్ బాషా, సుబ్బు, బాబు, సాగర్, ఆనంద్ తదతరులు పాల్గొన్నారు.