
సింహ వాహనంపై ప్రసన్న వేంకటేశ్వరుడు
తిరుపతి: తిరుపతికి 20 కి.మీల దూరంలో టీటీడీకి చెందిన అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం యోగ నారాయణ స్వామి అలంకారంలో స్వామివారు సింహ వాహనంపై భక్తులను అనుగ్రహించారు. ఉదయం 8 గంటలకు వాహనసేవ ప్రారంభమైంది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. సాయంత్రం ఊంజల్ మండపంలోకి శ్రీవారు వేంచేపు చేసి ఊంజల్ సేవ చేపట్టారు. కాగా
రాత్రి ప్రసన్న వేంకటాదీశుడు ముత్యపు పందిరి వాహనంపై భక్తులను ఆశీర్వదించారు. వాహన సేవల్లో డిప్యూటీ ఈవో హరీంధ్రనాథ్, ఏఈవో దేవరాజులు, సూపరింటెండెంట్ శ్రీవాణి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శివకుమార్, అర్చకులు, శ్రీవారి సేవకులు,భక్తులు పాల్గొన్నారు.
ఇదిలా ఉండగా…..హంస వాహనంపై సరస్వతీ అలంకారంలో ఆదివారం రాత్రి స్వామివారు భక్తులను అనుగ్రహించారు. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
