పంటనష్టం అంచనాల్లో అనవసర ప్రచారం వీడి.. రైతుల్ని ఆదుకోవడంపై దృష్టిపెట్టండి : మాజీమంత్రి ప్రత్తిపాటి.
….
- పత్తి కొనుగోళ్లకు.. ఇన్ పుట్ సబ్సిడీ అందజేతకు ఎలాంటి సంబంధం లేదు
- ప్రభుత్వ ఆదేశాలు లేకుండా తోచినట్టు ప్రచారం చేయకండి..
- క్షేత్రస్థాయిలో పంటనష్టాన్ని పరిశీలించి ప్రతి రైతుకు న్యాయం జరిగేలా చూడండి
- వ్యవసాయ అధికారుల, సిబ్బందికి మాజీమంత్రి స్పష్టమైన ఆదేశం
- యడ్లపాడు, నాదెండ్ల మండలాల్లో మొంథా ధాటికి దెబ్బతిన్న పొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి.
పంటలబీమా పరిహారం.. ఇన్ పుట్ సబ్సిడీ వంటివి అందించడంలో ప్రభుత్వం ఎలాంటి నిబందనలు పెట్టలేదని, సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో పత్తి విక్రయాలకు.. రైతులకు అందించే పరిహారానికి ఎలాంటి సంబంధం లేదని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు.
శుక్రవారం ఆయన యడ్లపాడు, నాదెండ్ల మండలాల్లో మొంథా ధాటికి నేలకొరిగిన పంటపొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి జరిగిన సష్టం..ఎంత పెట్టుబడి పెట్టారనే వివరాలు తెలుసుకున్నారు. అనంతరం రైతులు, వ్యవసాయ అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు.
తిమ్మాపురం, సొలస, జంగాలపల్లి, నాదెండ్ల గ్రామాల్లో పర్యటించిన ప్రత్తిపాటి.. బురదతో మేటవేసిన పత్తి, మిరప పైర్లను పరిశీలించారు. మొంథా పెనువిపత్తు వ్యవసాయ అధికారుల, సిబ్బందికి సవాల్ విసిరిందని, ఉరకెత్తే దశలో ఉన్న వివిధ పంటలు తిరిగి బతికించి, రైతుకు మేలు చేయడంపై వ్యవసాయ యంత్రాంగం దృష్టి సారించాలని ప్రత్తిపాటి సూచించారు.
అనవసర ప్రచారం వదిలేసి, పంటనష్టం సమగ్ర అంచనాలపై దృష్టి పెట్టి, రైతులకు న్యాయం చేయండి
పంటనష్టం అంచనాలో నిబంధనల పేరిట వ్యవసాయ అధికారులు, సిబ్బంది రైతుల్ని ఇబ్బందిపెట్టవద్దని, ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావద్దని ప్రత్తిపాటి ఆదేశించారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు లేకుండా అనవసర ప్రచారం చేయవద్దని, క్షేత్రస్థాయి పర్యటనతో నష్టపోయిన ప్రతి రైతును గుర్తించి, పంట నష్టం లెక్కల్ని సమగ్రంగా రూపొందించాలని, ఎక్కడ అలసత్వం ప్రదర్శించినా ఉపేక్షించేది లేదని ప్రత్తిపాటి వారిని హెచ్చరించారు. నియోజకవర్గ రైతాంగం సమస్యలు, మొంథా ప్రభావంతో దెబ్బతిన్న పంటనష్టం లెక్కింపుపై వ్యవసాయ శాఖ జేడీతో ఫోన్లో మాట్లాడిన ప్రత్తిపాటి.. ఎన్యుమరేషన్ విధివిధానాలపై సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
ఇన్ పుట్ సబ్సిడీకి.. పత్తికొనుగోళ్లకు సంబంధం లేదు..
రైతులకు ప్రభుత్వం అందించే ఇన్ పుట్ సబ్సిడీ.. పంటల బీమా సాయానికి, సీసీఐ కేంద్రాల ద్వారా జరిపే పత్తి కొనుగోళ్లకు ఎలాంటి సంబంధంలేదని ప్రత్తిపాటి ఈ సందర్భంగా చెప్పారు. యడ్లపాడు మండల హార్టీ కల్చర్ అసిస్టెంట్ ఈ విధంగా చెబుతున్నారని రైతులు ప్రత్తిపాటికి తెలియచేయగా ఆయన పై విధంగా స్పందించారు. పంట నష్టపోయిన రైతుల్లో ఆందోళన పెంచకుండా వ్యవసాయ అధికారులు, సిబ్బంది, మొంథా నష్టం అంచనాల్ని సమగ్రంగా రూపొందించి ప్రభుత్వానికి సకాలంలో నివేదికలు అందించాలని ప్రత్తిపాటి ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశాలు లేకుండా వ్యవసాయ, సచివాలయ అధికారులు లేనిపోని అనవసర ప్రచారాలతో రైతుల్ని భయాందోళనలకు గురిచేస్తే, తర్వాత జరిగే పరిణామాలకు వారే బాధ్యులవుతారని ప్రత్తిపాటి స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో జనసేన ఇంచార్జి తోట రాజారమేష్, టీడీపీ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ టీడీపీ కరీముల్లా, మండల అధ్యక్షులు కామినేని సాయిబాబు, జిల్లా రైతు అధ్యక్షులు మద్దూరి వీరారెడ్డి, టీడీపీ నాయకులు అంబటి సోంబాబు, గుర్రం నాగపూర్ణ చంద్రరావు, మద్దూరి శ్రీనివాసరెడ్డి పిచ్చయ్య, లోక బ్రహ్మయ్య, తోకల రాజేష్, జనసేన నాయకులు శరత్, ఎమ్మార్వో, ఏవో, హార్టికల్చర్ అధికారులు, విఆర్వో లు కూటమి ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
