TEJA NEWS

ప్రధాని నరేంద్ర మోడీ-అమిత్‌ షా ద్వయం, బిజెపి- దాని వాట్సప్‌ యూనివర్సిటీలు…బిజెపికి 370 సీట్లు, తన కూటమిలోని ఇతర పార్టీలకు మరో 30 సీట్లు… మొత్తం 400 సీట్లు సాధిస్తామని అబద్ధపు ప్రచారాలు చేస్తున్నాయి.

ఇదో పెద్ద కుట్ర. ‘ఇండియా’ బ్లాక్‌ పార్టీల నైతిక స్థైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీసేందుకు, ప్రజా మైండ్‌ గేమ్‌ని మార్చేందుకు ఇలా గోబెల్స్‌ ప్రచారం చేస్తున్నారు. ఇందులో ఎలాంటి వాస్తవం లేదు. బిజెపి 180 సీట్లు దాటడం గగనమే.

దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు,కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలలో మొత్తం 128 లోక్‌సభ స్థానాలున్నాయి. వీటిలో బిజెపి 2019 ఎన్నికలలో 29 స్థానాలు గెలిచింది.కర్ణాటకలోని 28 స్థానాలకు గాను 25 స్థానాలు,తెలంగాణలో నాలుగు స్థానాలను బిజెపి గెలిచింది. ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. ఆ రాష్ట్రంలో బిజెపి 10 స్థానాలకు పరిమితమయ్యే అవకాశం ఉన్నది.

తెలంగాణలో గెలిచిన నాలుగు స్థానాలకు అటు ఇటుగా ఉండొచ్చు. తమిళనాడు,కేరళలో సీట్లు పొందే అవకాశం లేదు.తమిళనాడులో ఎన్డీఏ పక్షమైన ఏఐడీఎంకే కూడా ఇప్పుడు దూరమైంది. ఏపీలో టిడిపితో పొత్తు కుదిరినందున ఒకటో, రెండో సీట్లు రావడానికి అవకాశం ఉన్నది.

దేశంలోని మొత్తం 543 లోక్‌సభ స్థానాల్లో దక్షిణాదికి చెందిన 128 స్థానాలు పోగా మిగిలిన 415 స్థానాలలో ఎన్డీఏ కూటమి రమారమి 385 స్థానాలు సాధించాలి లేదా బిజెపి 355 స్థానాలు సాధించాలి.

ఎన్డీఏ మిత్ర పక్షాలైన జనతాదళ్‌ (యునైటెడ్‌), శివసేన (ఏకనాథ్‌ షిండే), ఎన్సీపీ (అజిత్‌ పవార్‌), ఎన్డీఏ లోని ఇతర చిన్న, చితక పార్టీలకు కేటాయించిన సీట్లు పోగా బిజెపి ఉత్తర భారతంలో పోటీ చేసే సీట్లే 350కి కొద్దిగా అటు ఇటుగా ఉంటాయి.

నార్త్‌ ఇండియాలో బిజెపి పోటీ చేసే అన్ని సీట్లు గెలిస్తే గాని 370 సీట్లు సాధించలేదు.

ఉత్తర భారత రాష్ట్రాలైన మధ్యప్రదేశ్‌,రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లలో ఇటీవల కాలంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బిజెపికి ఊపునిచ్చిన మాట నిజమే. కానీ లోక్‌సభ ఎన్నికలలో ఈ మూడు రాష్ట్రాల నుండి అదనంగా బిజెపి సాధించేదేమీ లేదు.

ఈ మూడు రాష్ట్రాలలో 65 లోక్‌సభ స్థానాలుండగా, 2019 లోక్‌సభ ఎన్నికలలో బిజెపి 61 స్థానాలను, ఎన్డీఏ భాగస్వామ్య పక్షం ఒక స్థానంలో గెలుపొందాయి.అదనంగా గెలుపొందడానికి 3 స్థానాలే ఉన్నాయి.

రాజస్థాన్‌ 2023 అసెంబ్లీ ఎన్నికలలో బిజెపికి, కాంగ్రెస్‌ కు ఓట్ల తేడా 2.14 శాతం మాత్రమే. వామపక్షాలు, ఇతర మిత్రపక్షాలతో కాంగ్రెస్‌ పొత్తులు పెట్టుకుంటే ఫలితం మరో విధంగా ఉండేది. ఈ రాష్ట్రాలలో బిజెపికి 15 నుండి 20 స్థానాలు తగ్గడమే తప్ప పెరిగే అవకాశం లేదు.

2019 ఎన్నికలలో గుజరాత్‌, హర్యానా,ఢిల్లీ, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లలోని 52 లోక్‌సభ స్థానాలకు గాను 52 స్థానాలను (100 శాతం సీట్లు) బిజెపి గెలుపొందింది. హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం…ఢిల్లీ, గుజరాత్‌లో ఆప్‌, కాంగ్రెస్‌ మధ్య ఎన్నికల పొత్తు కుదరడం, రైతాంగ ఉద్యమంలో హర్యానా రైతులు పెద్దఎత్తున పాల్గొంటున్న నేపథ్యంలో బిజెపికి కనీసం 15 సీట్లు తగ్గే అవకాశం ఉన్నది.

80 లోక్‌సభ స్థానాలు కలిగిన ఉత్తరప్రదేశ్‌లో 2019 లో 49.98 శాతం ఓట్లతో 62 స్థానాలు బిజెపి గెలిచింది. 2014తో పోల్చితే 9 సీట్లు తగ్గాయి. 2022లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో 41.29 శాతం ఓట్లు మాత్రమే బిజెపి పొందింది.

యు.పి లో అయోధ్య తప్ప మిగతా ప్రాంతాల అభివృద్ధిని పట్టించుకోకపోవడం,సమాజ్‌వాది పార్టీ, కాంగ్రెస్‌ల మధ్య ఎన్నికల పొత్తు కుదరడం, ప్రభుత్వ వ్యతిరేకత తదితర కారణాల వలన బిజెపికి గత లోక్‌సభ ఎన్నికలతో పోల్చితే కనీసం 30 సీట్లు తగ్గే అవకాశం ఉన్నది.

హిందీ బెల్టులో మరో ముఖ్యమైన రాష్ట్రం బీహార్‌. 40 లోక్‌సభ స్థానాలకుగాను 2019లో బిజెపికి 17, ఎన్డీఏ పక్షాలైన జనతాదళ్‌ (యునైటెడ్‌)కు 16, లోక్‌జనశక్తి పార్టీ (ఎల్జీపి)కి 6 స్థానాలు వచ్చాయి. నితీష్‌కుమార్‌ ఊసరవెల్లి రంగులు మార్చినట్లు ప్రభుత్వాలను మార్చడం,బిజెపి నీతిమాలినచర్యలు, ప్రభుత్వ వ్యతిరేకత వెరసి రాష్ట్రీయ జనతాదళ్‌ (ఆర్జెడి), కాంగ్రెస్‌, వామపక్ష కూటమి సగానికి పైగా సీట్లు గెలుచుకునే అవకాశం ఉన్నది.

జార్ఖండ్‌ మొత్తం 14 సీట్ల గాను 2019లో బిజెపి 11, మిత్రపక్షం ఆల్‌ జార్ఖండ్‌ స్టూడెంట్‌ యూనియన్‌ (ఏజేఎస్‌యు) ఒక స్థానంలో గెలిచింది. ఇప్పుడు కాంగ్రెస్‌, జార్ఖండ్‌ ముక్తి మోర్చా (జెఎమ్‌ ఎమ్‌) మెరుగైన ఫలితాలు సాధించవచ్చని పరిశీలకుల అంచనా.

మహారాష్ట్రలోని 42 లోక్‌సభ స్థానాలకుగాను 2019 లో బిజెపి 23, అప్పటి ఎన్డీఏ భాగస్వామ్య పక్షమైన శివసేన 18 స్థానాలను పొందాయి. కాంగ్రెస్‌ ఒకటి, ఎన్సీపి నాలుగు, ఎంఐఎం ఒక స్థానంలో గెలిచాయి.

ఇప్పుడు శివసేన (ఏకనాథ్‌ షిండే), ఎన్సీపి (అజిత్‌ పవార్‌) ఎన్డీఏతో ఉన్నారు. శివసేన (ఉద్దవ్‌ థాకరే), ఎన్సీపి (శరద్‌ పవార్‌) ‘ఇండియా’ బ్లాక్‌తో ఉన్నారు. ‘ఇండియా’ బ్లాక్‌ పక్షాలు ఐదు సీట్ల కంటే పెరిగే పరిస్థితి ఉంది తప్ప తగ్గేదైతే లేదు.

పశ్చిమ బెంగాల్‌, ఒరిస్సా మొత్తం 63 సీట్లలో 2019లో బిజెపి పొందిన సీట్లు 26, కాంగ్రెస్‌ 3, బెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌ 22, ఒరిస్సాలో బిజు జనతాదళ్‌ 12 స్థానాలలో గెలుపొందాయి. ఈ రెండు రాష్ట్రాల్లో బిజెపికి బెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌, ఒరిస్సాలో బిజెడి ప్రత్యర్థి పార్టీలు.ఈ రాష్ట్రాల్లో బిజెపికి గతం కంటే సీట్లు పెరిగే అవకాశం లేదు.

పంజాబ్‌ 13, జమ్మూ కాశ్మీర్‌ 6, గోవా 2…మొత్తం 21 సీట్లలో 2019లో బిజెపి 6, కాంగ్రెస్‌ 9, అప్పటి ఎన్డీఏ పక్షమైన శిరోమణి అకాలీదళ్‌ 2, యుపిఏ పక్షం జమ్మూ అండ్‌ కాశ్మీర్‌ నేషనల్‌ కాన్ఫరెన్స్‌ 3, ఆప్‌ ఒక సీటు గెలుపొందాయి. ఇప్పుడు బిజెపి తిరిగి 6 సీట్లు పొందడం గగనమే.

సెవెన్‌ సిస్టర్స్‌గా పిలవబడే ఏడు ఈశాన్య రాష్ట్రాల్లో పెద్ద రాష్ట్రమైన అస్సాంలో 14 లోక్‌సభ స్థానాలు వుండగా, మిగతా ఆరు రాష్ట్రాల్లో పది లోక్‌సభ స్థానాలున్నాయి. సహోదర రాష్ట్రం సిక్కింలో ఒక లోకసభ స్థానం. మొత్తం 25 స్థానాలకు గాను 2019 జనరల్‌ ఎన్నికలలో బిజెపి 15, ఎన్డీఏ పక్షాలు మరో ఐదు గెలిచాయి. అదనంగా ఇక్కడ బిజెపికి, ఎన్డీఏకు సీట్లు పెరిగే అవకాశం లేదు.

మిగతా 6 కేంద్ర పాలిత రాష్ట్రాలైన లక్షద్వీప్‌, చండీగఢ్‌, పాండిచ్చేరి, అండమాన్‌ – నికోబార్‌, దాద్రా – నాగర్‌ హవేలీ, డామన్‌ – డయు లోని 6 లోక్‌సభ స్థానాలకుగాను 2019లో బిజెపికి రెండు, కాంగ్రెస్‌కు రెండు, ఇతరులకు రెండు వచ్చాయి.

వీటిలో ఎన్డీఏకి పెరిగేది లేదు. ‘ఇండియా’కు తగ్గేది లేదు. అటువంటి పార్టీ తమకు 400 స్థానాలు వస్తాయని ప్రచారం చేసుకుని ప్రజా మైండ్‌ సెట్‌ని మార్చి అధికారంలోకి వస్తామని చెప్పే అబద్ధాల మోడీ మీడియాకు, బిజెపికి బుద్ధి చెప్పి గద్దె దించాలి. బిజెపిని ఓడించకపోతే దేశానికివే ఆఖరి ఎన్నికలు కావచ్చు. కాబట్టి ప్రజలారా, ప్రజాతంత్ర వాదులారా మేల్కొనండి.

వ్యాసకర్త సిపిఎం నెల్లూరు జిల్లా పూర్వ కార్యదర్శి చండ్ర రాజగోపాల్


TEJA NEWS