TEJA NEWS

టీడీపీ అధినేత చంద్రబాబు సతీసమేతంగా మహారాష్ట్రలోని వివిద ఆలయాలను దర్శించుకున్నారు. కొల్హాపూర్​లోని శ్రీ మహాలక్ష్మి ఆలయాన్ని, శ్రీ షిరిడి సాయిబాబాను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం చంద్రబాబు దంపతులు హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు.

టీడీపీ అధినేత చంద్రబాబు సతీసమేతంగా మహారాష్ట్రలోని శ్రీ మహాలక్ష్మి(అంబాబాయి), షిరిడి సాయిబాబా ఆలయాలను సందర్శించారు. చంద్రబాబు, నారా భువనేశ్వరి దంపతులు ఈరోజు ఉదయం 11:30 హైదరాబాద్ నుంచి విమానంలో మహరాష్ట్రలోని కొల్హాపూర్​కు చేరుకున్నారు. మెుదటగా కొల్హాపూర్​లోని శ్రీ మహాలక్ష్మి ఆలయాన్ని సందర్శించారు. ఈ ఆలయాన్నే స్థానికంగా అంబాబాయిగా పిలుస్తారు. అక్కడ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ వర్గాలు చంద్రబాబు దంపతులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

అంబాబాయి దర్శనం అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ, కొల్హాపూర్​లోని అంబాబాయి ఆలయం దేశంలో ఉన్న 108 శక్తిపీఠాలలో ఒకటి తెలిపారు. భారతదేశంలోని వివిధ రకలైన పవిత్రమైన ప్రార్థన స్థాలాలలో ఈ ఆలయాని ఎంతో ప్రత్యేకత ఉందని వెల్లడించారు. అందుకే తాను అంబాబాయి ఆలయాన్ని సందర్శించానని తెలిపారు. ప్రజలకు సేవచేసే అవకాశం ఇవ్వాలని అంబాబాయి మాతను కోరినట్లు తెలిపారు. తల్లి మనందరిని ఆశీర్వదిస్తుందని చంద్రబాబు నాయుడు విశ్వాసం వ్యక్తం చేశారు. అలాగే దేశ ప్రజలు మరోసారి ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్నే ఎన్నుకుంటారని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కూటమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని తెలిపారు. ఈ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 400 లోక్‌సభ స్థానాలను ఎన్డీయే కూటమి కైవసం చేసుకుంటుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.

అయితే ఏటా దేశం నలుమూలల నుంచి భక్తులు అంబాబాయి ఆలయాన్ని సందర్శిస్తారు. ఈ ఆలయం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, గోవా రాష్ట్రంలోని అనేక మంది భక్తులకు ప్రార్ధనా స్థలంగా ఉంది. అలాగే అంబాబాయి మాతను దర్శించుకోవటం కోసం ఆంధ్రప్రదేశ్ నుంచి కొంతమంది భక్తులు కూడా వచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు ఆలయం నుంచి బయటకు వచ్చినప్పుడు జై బాబు అంటూ నినాదాలు చేశారు. వారిని చూసిన చంద్రబాబు ఆగి వారితో కొద్దిసేపు మాట్లాడారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు కొల్హాపూర్ వస్తున్నందున కొల్హాపూర్ జిల్లా పోలీసు యంత్రాంగం బుధవారమే భద్రతా ఏర్పాట్లను చేసింది. ఈరోజు చంద్రబాబు నాయుడు కొల్హాపూర్​కు చేరుకున్న వెంటనే ఆయన కాన్వాయ్ వెళ్లే మార్గంలో కొల్హాపూర్​ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో ఆలయ ప్రాంతంలోని దుకాణాలు కూడా కొద్దిసేపు మూతపడ్డాయి. కొల్హాపూర్​లోని అంబాబాయిని దర్శించుకున్న అనంతరం చంద్రబాబు షిరిడీకి వెళ్లిపోయారు.

అనంతరం మహారాష్ట్రలోని శ్రీ షిరిడి సాయిబాబాను తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆయన సతీమణి భువనేశ్వరి దర్శించుకున్నారు. షీర్డీ సంస్థాన్ ట్రస్ట్ సభ్యులు చంద్రబాబుకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం పూజ కార్యక్రమాలు నిర్వహించారు.


TEJA NEWS