TEJA NEWS

వస్తువులను తూకం వేసుకోవడంతో మోసాలకు చెక్
** ప్రపంచ మెట్రాలజీ దినోత్సవంలో వక్తలు

తిరుపతి: ప్రస్తుత సమాజంలో సాంకేతిక పరిజ్ఞానం బాగా పెరిగినప్పటికీ ప్యాకుల్లోని వస్తువులు, ద్రవ పదార్థాల(పెట్రోలు, నూనెలు వంటివి) తూకాల్లో మోసాలకు చెక్ పడాలంటే ప్రతి వినియోగదారుడు కొనుక్కునే వస్తువులను విధిగా తూకం వేయించుకోవాలని రాష్ట్రీయ వినియోగదారుల సొసైటీ కార్యదర్శి పావులూరు చిట్టిబాబు సూచించారు. “ప్రపంచ మెట్రాలాజీ దినోత్సవ” అవగాహన కార్యక్రమాన్ని చిత్తూరు జిల్లా పాలసముద్రం మండలం ఆముదాల గ్రామంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా డ్వాక్రా మహిళా సంఘాలు, అంగన్వాడీ కేంద్రాల సిబ్బందికి తూనికలు – కొలతల విభాగం పనితీరును వివరించారు. కొనే వస్తువుల నాణ్యత ఎంత ముఖ్యమో…. ఆ వస్తువుల బరువులో తూకాలు అంతే ముఖ్యమని తెలిపారు. ప్రతి సంవత్సరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు చేపట్టే ప్రతి అవగాహన కార్యక్రమాన్ని ప్రజలు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. అందులో భాగంగానే ఈసారి ప్రపంచ మెట్రాలాజీ దినోత్సవాన్ని మరింత ప్రయోజనకరంగా ఉండేలా అవగాహనలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. మనదేశంలో మెట్రాలాజికల్ సంస్థ 1950లో అమలులోకి వచ్చిందని, 1961లో మొదట అవగాహన చేపట్టారని వెల్లడించారు. ఇంత ప్రాధాన్యత కలిగిన ఈరోజు అవగాహన ద్వారా ప్రజల ఆరోగ్యం, భద్రతకు కేంద్ర ప్రభుత్వం… రాష్ట్ర ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాయో అర్థం అవుతోందన్నారు.