
రేషన్ బండ్ల కష్టాలకు చెక్ – నాదెండ్ల ప్రయత్నం !
రేషన్ బియ్యాన్ని ఇంటికి తెచ్చిస్తామంటూ వందల కోట్లు పెట్టి బండ్లు కొని.. అసలు వ్యవస్థను నాశనం చేసింది వైసీపీ ప్రభుత్వం. లబ్దిదారులు ఎప్పుడు కావాలంటే అప్పుడు రేషన్ దుకాణానికి వెళ్లి బియ్యం తెచ్చుకునేవారు. కానీ ఈ బండ్లు పెట్టిన తర్వాత వారు ఎప్పుడు వస్తే అప్పుడు సందు చివరికో… వాళ్లు బండి పెట్టిన ప్రాంతానికో పరుగెత్తుకుంటూ వెళ్లారు. రేషన్ దుకాణమే కొన్ని కొన్నిసార్లు దగ్గరగా ఉంటుంది.
ఈ ఎండీయూ వాహనాల వల్ల అటు ఆ వాహనాలు పెట్టుకున్న వారికి ఉపయోగం లేదు.. ఇటు లబ్దిదారులకు కష్టాలు. .వందల కోట్ల ధనం దుర్వినియోగం అయింది. ఇప్పుడు ఆ సమస్యను పరిష్కరించడం పెద్ద సమస్యగా మారింది. ఈ అంశంపై పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చాలా పరిశీలనలు జరిపారు. లబ్దిదారుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ ఎండీయూ వాహనాల వల్ల అనేక సమస్యలు వస్తున్నాయని.. రేషన్ దుకాణాల్లోనే తీసుకుంటామని అత్యధిక మంది లబ్దిదారులు చెప్పారు.
అలాగే ఈ వాహనాల ఈఎంఐలకూ.. ప్రభుత్వం ఇచ్చే కమిషన్ కు పొంతన లేదని ఆదాయం సరిపోవడం లేదని వాహన యజమానులు కూడా చెబుతున్నారు. దీంతో వారికీ ఓ పరిష్కారాన్ని చూపించాల్సి ఉంది. ఇక రేషన్ దుకాణదారులు కూడా పాత పద్దతిలో సేవలు చేయడానికి తాము సిద్దమేనని అంటున్నారు. అనారోగ్యంతో ఉన్న వారికి.. రాలేని వాళ్లకు డోర్ డెలివరీకీ వారు ముందుకు వస్తున్నారు. అన్నీ పరిశీలించి.. నేడో రేపో .. నాదెండ్ల మనోహర్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
