TEJA NEWS

తెలంగాణలో చికున్‌ గున్యా విజృంభణ..!!

447 కేసులు నమోదయ్యాయన్న వైద్యారోగ్య శాఖ
హైదరాబాద్‌, నవంబర్‌ 22 : తెలంగాణలో చికున్‌ గున్యా విజృంభిస్తున్నదని అమెరికాకు చెందిన సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) వెల్లడించింది.

తెలంగాణ నుంచి అమెరికాకు వచ్చే ప్రయాణికుల్లో ఊహించిన సంఖ్య కంటే ఎక్కువగా బాధితులు ఉన్నారని తెలిపింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ అమెరికా పర్యాటకులకు మార్గదర్శకాలు జారీ చేసింది. దేశంలో డెంగీ కేసులు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్న రాష్ర్టాల్లో తెలంగాణ ఉందని ఈ ఏడాది జూలైలో ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. వ్యాధుల కట్టడికి ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించింది.

డెంగీ, చికున్‌ గున్యా, మలేరియా, టైఫాయిడ్‌ విజృంభించే అవకాశం ఉన్నదని చాలా అధ్యయనాలు హెచ్చరించాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం పారిశుధ్య నిర్వహణ, దోమల నివారణ వంటి ముందస్తు చర్యలు తీసుకోలేదు. ఈ ఏడాది రికార్డు స్థాయిలో దాదాపు 8 వేల డెంగీ కేసులు నమోదయ్యాయి. దవాఖానాల్లోనూ ప్రభుత్వం సరైన సదుపాయాలు కల్పించలేదు. మందుల కొరతతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తాజాగా చికున్‌ గున్యాపై అమెరికా సీడీసీ వెల్లడించిన నివేదికతో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం మరోసారి బహిర్గతమైంది. సీడీసీ రిపోర్ట్‌పై రాష్ట్ర వైద్యారోగ్యశాఖ స్పందించింది. ఈ ఏడాది 447 కేసులు నమోదయ్యాయని వెల్లడించింది. ఫీవర్స్‌ సీజన్‌లో చికున్‌ గున్యా కేసులపై గోప్యత పాటిస్తూ తప్పుడు లెక్కలు ప్రకటించిన సర్కారు అమెరికా నివేదికతో అంకెలు మార్చి చెబుతున్నది.


TEJA NEWS