కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ ఆశయ సాధనకు ఉద్యమాలను మరింత బలోపేతం చేయాలి..

TEJA NEWS

కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ ఆశయ సాధనకు ఉద్యమాలను మరింత బలోపేతం చేయాలి….
— సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్…

పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి:గోదావరిఖని,
సమాజ మార్పు కోసం చివరి వరకు పోరాడిన విప్లవ నాయకుడు కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ ఆశయాలను కొనసాగిస్తూ ప్రజా, కార్మిక, రైతాంగ సమస్యలపై ఉద్యమాలను మరింత ఉధృతం చేయాలని సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ ప్రజాపంథా కరీంనగర్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్ పిలుపునిచ్చారు.

గోదావరిఖనిలోని పార్టీ కార్యాలయంలో సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ ప్రజాపంథా ఆధ్వర్యంలో కేంద్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్, కేంద్ర కమిటీ నాయకులు కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ రెండో వర్ధంతి సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్దపల్లి డివిజన్ కార్యదర్శి తోకల రమేష్ అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా జూపాక శ్రీనివాస్ మాట్లాడుతూ, కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ విప్లవ ఉద్యమాలకు జీవితాంతం అంకితభావంతో పనిచేశారని అన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారసత్వాన్ని కొనసాగిస్తూ దేశవ్యాప్తంగా రైతు, కార్మిక, ఆదివాసీ ఉద్యమాలకు నాయకత్వం వహించారని పేర్కొన్నారు. ఎమర్జెన్సీ కాలంలో అజ్ఞాత జీవితాన్ని గడుపుతూ ఉద్యమాన్ని కొనసాగించారని, అనంతరం ఇల్లందు, మహబూబాబాద్, వరంగల్, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో పార్టీ నిర్మాణానికి విశేషంగా కృషి చేశారని తెలిపారు.

అతివాద, మితవాద ధోరణులకు వ్యతిరేకంగా సిద్ధాంతపరమైన పోరాటం చేస్తూ ప్రజాపంథానే సరైన మార్గమని విశ్వసించి చివరి వరకు అదే సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నారని కొనియాడారు. ఆదివాసీల హక్కుల పరిరక్షణతో పాటు ఢిల్లీలో జరిగిన రైతు ఉద్యమంలో కూడా కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు.

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, కార్మిక, రైతాంగ వ్యతిరేక విధానాలపై బలమైన ఉద్యమాలు నిర్మించాలని, కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ ఆశయాలు, లక్ష్యాల సాధన కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు తోకల రమేష్, ఈసంపల్లి రాజేందర్, ఆడెపు శంకర్, గొల్లపల్లి చంద్రయ్య, మార్త రాములు, బుషిపాక దేవయ్య, కోడిపుంజుల లక్ష్మి, మార్త రాధ, ఇనుగాల రాజేశ్వర్, కలువల రాయమల్లు, క్రాంతి, రాజయ్య, దీవెనమ్మ తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top