రైతులకు ఊరట.. జూలై 16 నుంచి మూసీ ప్రాజెక్ట్ కాలువలకు సాగునీటి విడుదల

TEJA NEWS

రైతులకు ఊరట.. జూలై 16 నుంచి మూసీ ప్రాజెక్ట్ కాలువలకు సాగునీటి విడుదల

సాక్షిత న్యూస్ ఉమ్మడి నల్గొండ జిల్లా బ్యూరో

ఖరీఫ్ సీజన్-2026కు సంబంధించి మూసీ ప్రాజెక్ట్ కాలువల ద్వారా సాగునీటి విడుదల షెడ్యూల్‌ను సూర్యాపేట ఇరిగేషన్ డివిజన్–1 ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రకటించారు. ఈ మేరకు జూలై 16 నుంచి దశలవారీగా రైతులకు సాగునీరు అందించనున్నట్లు తెలిపారు. ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం తొలి విడత (1st Wetting)లో జూలై 16 నుంచి ఆగస్టు 5 వరకు మొత్తం 20 రోజుల పాటు నీటిని విడుదల చేయనున్నారు. ఈ విడతకు 1.091 టీఎంసీల నీరు అవసరమవుతుందని అధికారులు పేర్కొన్నారు. తొలి విడత అనంతరం ఆగస్టు 5 నుంచి ఆగస్టు 20 వరకు 15 రోజుల గ్యాప్ పీరియడ్ ఉండనుంది. అనంతరం ఆగస్టు 20 నుంచి సెప్టెంబర్ 4 వరకు రెండో విడత (2nd Wetting)లో 15 రోజుల పాటు సాగునీటిని విడుదల చేస్తారు.

దీనికి 0.792 టీఎంసీల నీరు వినియోగించనున్నారు. ఆ తర్వాత సెప్టెంబర్ 4 నుంచి సెప్టెంబర్ 19 వరకు మరో 15 రోజుల గ్యాప్ పీరియడ్ కొనసాగుతుంది. అనంతరం సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు మూడో విడత (3rd Wetting)లో 15 రోజుల పాటు నీటిని విడుదల చేయనున్నారు. ఈ విడతకు 0.771 టీఎంసీల నీరు అవసరమని షెడ్యూల్‌లో పేర్కొన్నారు. మొత్తం 80 రోజుల ప్రణాళికలో 2.819 టీఎంసీల నీటిని వినియోగించనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టులో +640.92 అడుగుల నీటిమట్టం వద్ద నికరంగా 3.098 టీఎంసీల నీరు అందుబాటులో ఉంటుందని అంచనా వేశారు. అలాగే, నాలుగో విడత సాగునీటి విడుదల ప్రాజెక్టులో అందుబాటులో ఉండే నీటి నిల్వలను బట్టి నిర్ణయిస్తామని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్పష్టం చేశారు. ఈ షెడ్యూల్ ప్రకటనతో మూసీ ప్రాజెక్ట్ ఆయకట్టు రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. రైతులు నీటి వినియోగాన్ని ప్రణాళికాబద్ధంగా నిర్వహించి పంటల సాగును విజయవంతం చేసుకోవాలని సాగునీటి శాఖ అధికారులు సూచించారు.

You cannot copy content of this page

Scroll to Top