
లింగాపూర్ మోడల్ స్కూల్ విద్యార్థి మృతి ఘటనపై ఆందోళన…
బాధ్యులపై చర్యలు, కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా డిమాండ్….
పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి:రామగుండం, రామగుండం నియోజకవర్గంలోని అంతర్గాం మండలం లింగాపూర్ మోడల్ స్కూల్లో బావిలో పడి విద్యార్థి సాత్విక్ మృతి చెందిన ఘటనపై బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్, ఎన్ఎస్యూఐ, విద్యార్థి, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పాఠశాల ఎదుట భారీ నిరసన చేపట్టారు.
ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి రేణుకుంట్ల ప్రీతం, ఎన్ఎస్యూఐ రాష్ట్ర కార్యదర్శి బైరిమల దుర్గ ప్రసాద్ మాట్లాడుతూ, పర్యవేక్షణ లోపం కారణంగానే ఈ విషాదం చోటుచేసుకుందని ఆరోపించారు. ఘటనకు బాధ్యులైన ప్రిన్సిపాల్, పీఈటీని వెంటనే సస్పెండ్ చేయాలని, బాధిత కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించడంతో పాటు కుటుంబంలోని ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
దాదాపు మూడు గంటల పాటు కొనసాగిన నిరసన సందర్భంగా పెద్దపల్లి ఆర్డీవో గట్టయ్య సంఘటన స్థలానికి చేరుకుని బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని మీడియా సమక్షంలో హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు.
అదేవిధంగా బాధిత కుటుంబానికి న్యాయం చేయడంలో కృషి చేస్తున్న రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ నిరసన కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు గొడిసెల ప్రణీత్, పప్పు శ్రీకాంత్, దుర్గ అవినాష్, పవన్, నందకిషోర్ తదితరులు పాల్గొన్నారు.