
ఆస్తి కోసం అత్తను హత్య చేసిన కోడలు అరెస్ట్
గుట్టురట్టు చేసిన పోలీసులు..
నిందితురాలిని రిమాండ్‌కు తరలింపు
వివరాలు వెల్లడించిన సూర్యాపేట డీఎస్పీ ప్రసన్న కుమార్
ఉమ్మడి నల్గొండ జిల్లా :
ఆస్తి వివాదమే అత్త హత్యకు కారణమైన ఘటన సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం తూర్పుగూడెం గ్రామంలో వెలుగుచూసింది. మొదట అనుమానాస్పద మృతిగా నమోదైన ఈ కేసును పోలీసులు లోతుగా దర్యాప్తు చేసి, సొంత కోడలే హంతకురాలని గుర్తించారు. నిందితురాలిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా, రిమాండ్‌కు తరలించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సూర్యాపేట ఎస్డీపీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ ప్రసన్న కుమార్, తుంగతుర్తి సీఐ డి. ఉపేందర్ రావుతో కలిసి వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుగూడెం గ్రామానికి చెందిన కోణతం భాగ్యమ్మకు ఆరు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఆ భూమిలో తనకు వాటా కావాలని ఆమె కుమార్తె ఉప్పు శోభ స్థానిక కోర్టులో సివిల్ దావా (O.S. No.10/2024) దాఖలు చేయడంతో కుటుంబంలో ఆస్తి వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలో ఏప్రిల్ 26న శోభ తల్లిని కలిసి భూమి వాటా విషయమై మాట్లాడి వెళ్లిపోయింది.
ఈ ఘటనతో ఆగ్రహానికి గురైన కోడలు కోణతం మాధవి, ఏప్రిల్ 27 రాత్రి ఇంట్లో అత్తతో భూమి విషయమై వాగ్వాదానికి దిగింది. తనకూ రెండు ఎకరాల భూమి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గొడవ పడిన మాధవి, అత్తను తోసివేసి కిందపడగొట్టి, అనంతరం మంచంపైకి నెట్టి గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం మంచం మీద నుంచి కిందపడిపోవడంతో మృతి చెందినట్లు బంధువులను నమ్మించే ప్రయత్నం చేసినట్లు వెల్లడించారు. మరుసటి రోజు అంత్యక్రియలకు ముందు మృతదేహానికి స్నానం చేయిస్తుండగా భాగ్యమ్మ మెడపై గాయాలు కనిపించడంతో కుమార్తె శోభ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో తుంగతుర్తి పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో కోణతం మాధవే ఆస్తి కోసం అత్తను హత్య చేసినట్లు తేలడంతో జూలై 15న ఆమెను అరెస్ట్ చేశారు. నిందితురాలి వద్ద నుంచి ఒక సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు, కోర్టులో హాజరుపరచి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ ప్రవీణ్ కుమార్ తెలిపారు.