TEJA NEWS

మహబూబ్‌నగర్‌ జిల్లా: పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా నారాయణపేటలో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో జన జాతర సభ జరగనుంది. సభకు ముఖ్య అతిథిగా సీఎం రేవంత్‌రెడ్డి హాజరు కానున్నారు. జిల్లా కేంద్రంలోని జూనియర్ కాలేజీ మైదానంలో సభ జరగనుంది. మహబూబ్ నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. హెలికాప్టర్‌ ద్వారా నారాయణపేట చేరుకోనున్న సీఎం రేవంత్ రెడ్డి.. రోడ్డు మార్గంలో తిరిగి హైదరాబాద్‌ చేరుకోనున్నారు. సొంత జిల్లా కావడం, కొడంగల్‌ నియోజకవర్గం మహబూబ్‌నగర్‌ పరిధిలో ఉండడంతో.. ఇక్కడ గెలుపును ఆయన ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత కోస్గిలో నిర్వహించిన సభలోనే మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ అభ్యర్థిగా చల్లా వంశీచంద్‌రెడ్డి పేరును స్వయంగా రేవంతే ప్రకటించిన విషయం తెలిసిందే.

గత నెల 6న మహబూబ్‌నగర్‌లో భారీ సభ నిర్వహించగా.. ఇప్పుడు నారాయణపేటలో జనజాతర సభ నిర్వహించనున్నారు. నారాయణపేట జిల్లా పరిధిలోని రెండు అసెంబ్లీ సెగ్మెంట్లలో బీజేపీ అభ్యర్థికి మెజారిటీ దక్కకుండా చేసేందుకు ఈ సభను ప్లాన్‌ చేసినట్లు తెలుస్తోంది. వంశీచంద్‌ గెలుపు కోసం మరో సభ నిర్వహించడంతోపాటు నామినేషన్‌ దాఖలుకు సీఎం హాజరయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. తన పర్యటన ద్వారా పార్టీ నేతలు, కార్యకర్తల్లో ఉత్సాహం నింపడంతోపాటు ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేయనున్నారు. అలాగే, బీజేపీకి కొంత బలం ఉంటుందని భావిస్తున్న నియోజకవర్గాల్లో ఆపరేషన్‌ ఆకర్ష్‌ ద్వారా నేతలను చేర్చుకుంటున్నారు. ఇప్పటికే మక్తల్‌ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన మదిరెడ్డి జలంధర్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరగా, మరి కొందరు నేతలు కూడా సోమవారం నిర్వహించనున్న సభలో పార్టీలో చేరే అవకాశాలున్నాయి..


TEJA NEWS