TEJA NEWS

దేశవ్యాప్తంగా రైళ్లపై దాడులకు కుట్ర..

పసిగట్టిన ఇంటెలిజెన్స్

ఢిల్లీ: దేశవ్యాప్తంగా రైళ్లపై దాడులు చేయాలంటూ భారతదేశంలోని స్లీపర్ సెల్స్‌కు టెర్రరిస్ట్ ఫర్హతుల్లా ఘోరీ హితోపదేశం చేస్తున్నట్టుగా ఉన్న ఓ వీడియోను ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించి వెంటనే అప్రమత్తమయ్యాయి. ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉన్న పరారీలో ఉన్న జిహాదిస్ట్ ఘోరీ, పాకిస్థాన్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI) సపోర్టుతో బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో స్లీపర్ సెల్ ద్వారా పేలుళ్లకు పాల్పడ్డాడని సమాచారం. కొన్నేళ్లుగా ఇండియన్ ఏజెన్సీల రాడార్‌లో ఉన్న ఘోరీ, ఇండియన్ రైల్వేస్‌కు చెందిన పలు రైళ్లను పట్టాలు తప్పించడానికి స్లీపర్ సెల్స్‌కు పిలుపునిస్తున్నట్లుగా వీడియోలో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రెషర్ కుక్కర్లను ఉపయోగించి బాంబు పేలుళ్లకు సంబంధించిన వివిధ పద్ధతులను సైతం ఘోరీ వివరించినట్టు సమాచారం. భారతదేశంలోని పెట్రోలియం పైప్‌లైన్‌, హిందూ నాయకులను లక్ష్యంగా చేసుకున్నట్టుగా కూడా వీడియో ద్వారా ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించినట్టు తెలుస్తోంది.

గవర్నమెంట్‌ను షేక్ చేస్తాం..

ఈడీ, ఎన్ఐఏ ద్వారా భారత ప్రభుత్వం స్లీపర్ సెల్స్‌ను వారి ఆస్తులను లక్ష్యంగా చేసుకుని నిర్వీర్యం చేస్తోందని ఘోరీ వీడియోలో తెలిపాడు. తాము తిరిగొచ్చి ఇండియన్ గవర్నమెంట్‌ను షేక్ చేస్తామని వీడియోలో ఘోరీ వెల్లడించాడు. మూడు వారాల క్రితం టెలిగ్రామ్‌లో ఈ వీడియో విడుదలైనట్టు ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు తెలిపాయి. మార్చి 1న రామేశ్వరం కేఫ్‌లో జరిగిన పేలుడులో కనీసం 10 మంది గాయపడ్డారు. మార్చి 3న కేసును స్వాధీనం చేసుకున్న ఎన్ఐఏ.. ఏప్రిల్ 12న ఇద్దరు కీలక నిందితులు అద్బుల్ మతీన్ అహ్మద్ తాహా, ముస్సావిర్ హుస్సేన్ షాజిబ్‌లను అరెస్టు చేసింది. తాహా సూత్రధారి అయితే, షాజిబ్ ప్రముఖ కేఫ్‌లో ఐఈడీని పెట్టినట్టు ఆరోపణలు వచ్చాయి. కోల్‌కతాకు సమీపంలోని లాడ్జిలో నిందుతులిద్దరినీ అరెస్ట్ చేయడం జరిగింది. తాహా, షాజిబ్ ఇద్దరూ కర్ణాటకలోని శివమొగ్గ కేంద్రంగా పనిచేస్తున్న ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) మాడ్యూల్‌లో సభ్యులు. అదే మాడ్యూల్‌కు చెందిన షరీక్ 2022 నవంబర్‌లో మంగళూరులో పేలుడుకు పాల్పడ్డాడు. ఫర్హతుల్లా ఘోరీ, అతని అల్లుడు షాహిద్ ఫైసల్‌కు దక్షిణ భారతదేశంలో స్లీపర్ సెల్‌ల బలమైన నెట్‌వర్క్‌ ఉంది. రామేశ్వరం కేఫ్‌లో జరిగిన పేలుడు ఘటనలో నిందితులుగా ఉన్న ఇద్దరితోనూ ఫైసల్ టచ్‌లో ఉండటంతో పాటుఈ కేసులో హ్యాండ్లర్‌గా ఉన్నాడు.

ఎవరీ ఫర్హతుల్లా ఘోరీ?

ఫర్హతుల్లా ఘోరీకి అబూ సుఫియాన్, సర్దార్ సాహబ్, ఫరూ అనే పేర్లు కూడా ఉన్నాయి. 2002లో గుజరాత్‌లోని అక్షరథామ్ దేవాలయంపై జరిగిన దాడిలో 30 మందికి పైగా మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో సహా అనేక ఉన్నత స్థాయి దాడులతో ఫర్హతుల్లాకు సంబంధం ఉంది. 2005లో హైదరాబాద్‌లోని టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయంపై జరిగిన ఆత్మాహుతి దాడి వెనుక కూడా ఆయన హస్తం ఉంది. ఘోరీ ఆన్‌లైన్ జిహాదిస్ట్ రిక్రూట్‌మెంట్‌ కార్యకలాపాలు చూస్తున్నాడని.. ఢిల్లీ పోలీసులు గతంలో తెలిపారు. ఘోరీ ఉగ్రవాదుల హ్యాండ్లర్ అని వారు వెల్లడించారు. కొన్ని నెలల క్రితం, పుణె-ఐఎస్‌ఐఎస్ మాడ్యూల్‌కు చెందిన అనేక మంది ఉగ్రవాదులను దేశవ్యాప్తంగా అరెస్టు చేయడంతో ఢిల్లీ పోలీసులు ఘోరీ పేరును రికార్డుల్లోకి ఎక్కించారు. భారత్‌లో ఐఎస్‌ఐ స్లీపర్‌ సెల్స్‌ను నిర్వహిస్తోందని.. వాటి ద్వారా దాడులకు యువకులను రిక్రూట్‌ చేస్తోందని అధికారులు అప్పట్లో వెల్లడించారు.


TEJA NEWS