
కోతుల దాడితో కాంట్రాక్ట్ కార్మికుడికి తీవ్ర గాయాలు…
సింగరేణి యాజమాన్యంపై కార్మిక సంఘం ఆగ్రహం..
పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: గోదావరిఖని, సింగరేణి సంస్థలో కాంట్రాక్ట్ కార్మికుల భద్రతను యాజమాన్యం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘం నాయకులు శనగల శ్రీనివాస్, మద్దెల శ్రీనివాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కోతుల దాడిలో తీవ్రంగా గాయపడిన కాంట్రాక్ట్ కార్మికుడు ఓరుగంటి మహేందర్‌ను సింగరేణి ఏరియా ఆసుపత్రిలో పరామర్శించి, అతని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
ఆర్‌జీ-2లోని సివిల్ డిపార్ట్‌మెంట్‌లో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తున్న ఓరుగంటి మహేందర్ ఫిల్టర్ బెడ్ వద్ద విధులు నిర్వహిస్తుండగా, ఒక్కసారిగా కోతుల గుంపు అతనిపై దాడి చేసింది. వాటి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో సుమారు 10 అడుగుల ఎత్తులో ఉన్న వాటర్ ట్యాంక్ మెట్లపై నుంచి కిందపడటంతో అతని ఎడమ కాలు విరిగింది. ప్రస్తుతం అతను సింగరేణి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ, సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికులకు కనీస భద్రతా చర్యలు కూడా కల్పించడంలో యాజమాన్యం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. అధిక పనిభారం, తక్కువ వేతనాలతో కార్మికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని విమర్శించారు.
పని ప్రదేశాల్లో కోతుల బెడద తీవ్రంగా ఉన్నప్పటికీ అధికారులు ఎలాంటి నివారణ చర్యలు చేపట్టకపోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని వారు అన్నారు. ఇకనైనా యాజమాన్యం వెంటనే స్పందించి కార్మికుల భద్రతకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, ఓరుగంటి మహేందర్ పూర్తిగా కోలుకుని తిరిగి విధుల్లో చేరే వరకు పూర్తి వేతనం చెల్లించాలని, అలాగే ప్రమాదానికి గురైన కార్మికుడి కుటుంబానికి తగిన నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు.లేకపోతే కాంట్రాక్ట్ కార్మికుల పక్షాన పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని సంఘం నాయకులు హెచ్చరించారు.