కొండా సురేఖ హోంమంత్రి కావాలనుకున్నారా?
ఇప్పుడు అనుకోని అవాంతరం వచ్చిపడిందని అసంతృప్తిలో ఉన్నారా?
నాగార్జున ఫ్యామిలీ, సమంత మీద కామెంట్స్ చేసి తీవ్ర దుమారం లేపారు కొండా సురేఖ.
అమాత్యులవారు అందనంత స్థాయికి వెళ్లాలని ఆశపడ్డారు. సీఎం తర్వాత అంతటి పోస్ట్‌లో ఉండాలని అనుకున్నారు. ప్రమోషన్‌తో పెద్ద పదవి చేపట్టి తన తడాఖా ఏంటో చూపించాలనుకున్నారు. పోలీస్ డిపార్ట్‌మెంట్‌ను చేతిలో పెట్టుకుని.. హడలెత్తించాలనుకున్నారు.
అందుకోసం ఢిల్లీ లెవల్‌లో లాబీయింగ్ కూడా చేసినట్లు టాక్. కానీ అనుకోని చిక్కులు ఆమె వెంటపడ్డాయి. ఉన్న పదవే ఊస్ట్ అయ్యేలా ఉంది. ఆమె హోంమంత్రి కావాలని కలలు కన్నారా.? కాంట్రవర్సీ కామెంట్స్‌తో అసలుకే ఎసరు వచ్చిందా.? ప్రమోషన్ వస్తుందనుకుంటే ఇలా అయ్యిందేంటని తలపట్టుకుంటున్నారా.? ఎవరా మంత్రి.? ఏమనుకుంటే ఏమైంది.?
కొండా సురేఖ పదిరోజులుగా టాక్ ఆఫ్ ది మీడియా అయిపోయారు. మెయిన్ స్ట్రీమ్ మీడియా అయినా..సోషల్ మీడియా అయినా ఆమె సెంట్రిక్‌గా చర్చ జరుగుతోంది. ఒకే ఒక స్టేట్‌మెంట్‌తో అందరికీ టార్గెట్ అయిపోయారామె. నాగార్జున ఫ్యామిలీ, సమంత మీద కామెంట్స్ చేసి తీవ్ర దుమారం లేపారు కొండా సురేఖ.
బర్తరఫ్ చేయాలన్న డిమాండ్లు
దీంతో ఆమెను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలన్న డిమాండ్లు జోరందుకున్నాయి. ఏకంగా ఆమె మీద పరువునష్టం దావా కూడా వేశారు హీరో నాగార్జున. అయితే ఈ వివాదం జరిగి కంటే ముందు కొండా సురేఖ హోంమంత్రి కావాలనుకున్నారట. అందుకోసం ఢిల్లీ లెవల్‌లో ప్రయత్నం కూడా చేశారని టాక్ వినిపిస్తోంది. అనుకోని చిక్కుల్లో పడి చివరికి ఉన్న మంత్రి పదవికే ఎసరొచ్చిందన్న ప్రచారం జరుగుతోంది.
ఇప్పటికే తెలంగాణ సర్కార్‌లో అటవీ, దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న కొండా సురేఖ.. హోంమంత్రిగా ప్రమోషన్ ఇవ్వాలని అధిష్టానం పెద్దల దగ్గర లాబీయింగ్ చేశారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతలో నాగార్జున కుటుంబంపై వ్యాఖ్యలు చేయడం..ఆ వివాదం చిలికిచిలికి గాలివానగా మారడంతో ఇప్పుడు ఆమెపై ఏ క్షణంలోనైనా వేటు పడే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది.
బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను విమర్శించే క్రమంలో ఆమె నాగార్జున కుటుంబంతో పాటు..నాగచైతన్య, సమంతల విడాకులపై సంచలన ఆరోపణలు చేయడంతో వివాదం రాజుకుంది. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు కాంగ్రెస్ నేతలు కొండా సురేఖతో ప్రకటన చేయించినా..అప్పటికే పెద్ద ఇష్యూ అయిపోయింది. ఫిర్యాదులు వెల్లువెత్తడంతో కాంగ్రెస్ అధిష్టానం కూడా సీరియస్‌గా ఉన్నట్లు చర్చ జరుగుతోంది.
కొండా సురేఖ వ్యాఖ్యల వివాదం నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో ఓ ఆసక్తికరమైన అంశంపై చర్చ జరుగుతోంది. ప్రస్తుతం అటవీ, దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న కొండా సురేఖ ప్రమోషన్ కోరుకున్నారట. తాను తెలంగాణకు హోంమంత్రి కావాలని ఆమె ఆశపడ్డట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రమోషన్ ఇచ్చి హోమంత్రి పదవి కట్టబెట్టాలని కాంగ్రెస్ అధిష్టానం దగ్గర లాబీయింగ్ కూడా చేశారట కొండా సురేఖ.
కొండా సురేఖ లేఖ?
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ దీపాదాస్ మున్సితో పాటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను కలిసిన సందర్భంలో తన మనసులో మాట చెప్పి విజ్ఞప్తి చేశారని అంటున్నారు. అంతేకాదు తనకు హోంమంత్రి పదవి ఇవ్వాలని ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీరి కొండా సురేఖ లేఖ కూడా రాశారన్న చర్చ కాంగ్రెస్ పార్టీలో జరుగుతోంది. అందుకే మంత్రివర్గ విస్తరణలో తనకు కచ్చితంగా హోంమంత్రిగా ప్రమోషన్ వస్తుందని గంపెడాశతో ఉన్న ఆమె..ఇప్పుడు గందరగోళంలో పడిపోయారని చర్చించుకుంటున్నారు హస్తం నేతలు.
హోంమంత్రి అవ్వాలనుకుంటే అనుకోని అవాంతరం వచ్చిపడిందని కొండా సురేఖ కూడా అసంతృప్తిగా ఉన్నారట. ఆవేశంలో కేటీఆర్‌ను టార్గెట్ చేయబోయి..తానే టార్గెట్ అయ్యానని అనుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. కొండా సురేఖ వ్యాఖ్యల అంశాన్ని కాంగ్రెస్ అధిష్టానం సీరియస్‌గా తీసుకోవడంతో ఏ క్షణంలోనైనా ఆమెపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
మరీ ముఖ్యంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడంతో కొండా సురేఖపై ఎప్పుడైనా వేటు పడే ఛాన్స్ ఉందని అంటున్నారు కొందరు కాంగ్రెస్ లీడర్లు. ఉన్నశాఖ కంటే కాస్త పెద్దశాఖైన హోంమంత్రి కావాలనుకుంటే..ఉన్న పదవి కూడా పోయేలా ఉందని కొండా సురేఖ తన సన్నిహితుల దగ్గర వాపోతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.