TEJA NEWS

భయపడను: బీజేపీ, డీఎంకేపై విజయ్ హాట్ కామెంట్స్, ఎన్టీఆర్‌ని గుర్తు చేసి..

చెన్నై: కొత్త రాజకీయ పార్టీతో తమిళనాడు రాజకీయాల్లో ప్రవేశించిన ప్రముఖ సినీనటుడు, దళపతి విజయ్ తన శక్తివంతమైన ప్రసంగంతో ప్రత్యర్థి పార్టీలకు చురకలంటించారు..

తనకు రాజకీయ అనుభవం లేకపోవచ్చు కానీ.. తాను పాలిటిక్స్ విషయంలో భయపడటం లేదు అని స్పష్టం చేశారు. విల్లుపురం సమీపంలో నిర్వహించిన తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ మొదటి మహానాడులో విజయ్ సుదీర్ఘ ప్రసంగం చేశారు.

ద్రవిడ జాతీయవాదం, తమిళ జాతీయవాదాన్ని వేరు చేయబోమన్నారు. తమిళనాడు గడ్డకు ఇవి రెండు కళ్ల లాంటివన్నారు. లౌకిక, సామాజిక న్యాయ సిద్ధాంతాలే తమ భావజాలమని చెప్పుకొచ్చారు. దీని ఆధారంగానే పనిచేస్తామన్నారు. రాజకీయాల్లో ఫెయిల్యూర్స్, సక్సెస్ స్టోరీలు చదివాక.. తాను తన కెరీర్‌ని పీక్‌లో వదిలేసి మీ అందరిపై అచంచలమైన విశ్వాసాన్ని ఉంచి మీ విజయ్‌గా ఇక్కడ నిలబడ్డా అని విజయ్ పేర్కొన్నారు.

రాజకీయాల్లో పిల్లలమంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారని.. కానీ, అమితమైన ఆత్మవిశ్వాసంతో మనం రాజకీయాలతో ఆడుకునే పిల్లలమని విజయ్ ప్రత్యర్థులకు కౌంటర్ ఇచ్చారు. పెరియార్ ఈవీ రామస్వామి, కె కామరాజ్, బాబాసాహెబ్ అంబేద్కర్, వేలు నాచియార్, అంజలి అమ్మాళ్ ఆశయాలతో పార్టీని నడిపిస్తామని విజయ్ చెప్పుకొచ్చారు. మరోవైపు, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకేపైన నేరుగా విమర్శలు గుప్పించారు. బీజేపీ నిరంకుశత్వంతో వ్యవహరిస్తందని విమర్శించారు.


TEJA NEWS