
11వ.డివిజన్ కృష్ణానగర్‌లో డ్రైనేజీ దుస్థితి.. బురదతో నిలిచిపోయిన మురుగునీరు, ప్రమాదంలో కాలువ…
పెద్దపల్లి// జిల్లా ప్రతినిధి: గోదావరిఖని,
రామగుండం నగరపాలక సంస్థ పరిధిలోని 11వ డివిజన్ కృష్ణానగర్‌లో డ్రైనేజీ కాలువ అధ్వాన్న స్థితికి చేరుకోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలువపై భారీగా బురద, మట్టి పేరుకుపోవడంతో మురుగునీరు ముందుకు ప్రవహించకుండా నిలిచిపోతుండటంతో దుర్వాసన వ్యాపించి ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజల సౌకర్యార్థం భారీ వ్యయంతో నిర్మించిన డ్రైనేజీ కాలువ ప్రస్తుతం సరైన నిర్వహణ లేక నిరుపయోగంగా మారిందని, కాలువ గోడలు దెబ్బతిని ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ సమస్యపై పలుమార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని, స్థానిక కార్పొరేటర్‌కు కూడా సమస్యను వివరించినా స్పందించలేదని కాలనీవాసులు ఆరోపించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో డివిజన్ ప్రజలు నిత్యం ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు.
ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి డ్రైనేజీ కాలువపై పేరుకుపోయిన బురద, మట్టిని వెంటనే తొలగించి మురుగునీరు సాఫీగా ప్రవహించేలా చర్యలు తీసుకోవాలని, కాలువకు మరమ్మతులు చేపట్టి ప్రజల సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని కృష్ణానగర్ కాలనీవాసులు డిమాండ్ చేశారు.