TEJA NEWS

ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో కోటి రూపాయల డ్రగ్స్

హైదరాబాద్:జనవరి 19
హైదరాబాద్ సిటీని డ్రగ్స్ ఫ్రీగా మార్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది పోలీస్ శాఖ. విస్తృత స్థాయిలో తనిఖీలు చేపట్టింది. నిఘా పెంచింది. ఈ క్రమంలో డ్రగ్స్, గంజాయి భారీగా పట్టుబడుతుంది. నేడు ఏకంగా రాజస్థాన్ ముఠా పట్టుబడటం సంచలనంగా మారింది.

రాజస్థాన్ నుంచి హైదరాబాద్ సిటీకి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో వస్తున్న ఓ ముఠా నుంచి కోటి రూపాయల విలువైన 150 గ్రాముల హెరాయిన్, 32 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ పట్టుకున్నారు పోలీసులు. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు.

ఎస్ఓటీ, మీర్ పేట్ పోలీసుల జాయింట్ ఆపరేషన్ లో ఈ గుట్టు రట్టు అయ్యింది. నలుగురు నిందితులు రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన వారే. మొదట వీరు డ్రగ్స్ బానిసలు అయ్యారు.. ఆ తర్వాత డ్రగ్స్ వ్యాపారంలోకి దిగారని విచారణలో వెల్లడైంది. రాజస్థాన్ రాష్ట్రం నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ లో హైదరాబాద్ సిటీకి తీసుకొచ్చి.. కస్టమర్లకు అమ్ముతున్నారు. ఒక్కో గ్రామును 12 వేల రూపాయలకు విక్రయిస్తున్నట్లు.. పట్టుబడిన నిందితులు స్పష్టం చేశారు.

ర్యాపిడో, ఉబర్ లాంటి ఆన్ లైన్ ట్రావెల్ సర్వీసుల ద్వారా కస్టమర్లకు డ్రగ్స్ చేరవేస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. రాజస్థాన్ లో గ్రాము 5 వేల రూపాయలకు కొనుగోలు చేస్తున్నారని.. హైదరాబాద్ లో 12 వేల రూపాయలకు అమ్ముతున్నారని వివరించారు.

పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు. రాజస్థాన్ ముఠా నుంచి హైదరాబాద్ సిటీలో ఎవరెవరు డ్రగ్స్ కొనుగోలు చేశారు.. ఎక్కడెక్కడికి సప్లయ్ జరిగింది.. కొనుగోలు చేసిన వారిలో ఎవరు ఉన్నారు అనే విషయాలను కూడా రాబడుతున్నామని.. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడించనున్నట్లు కమిషనర్ చెప్పారు.


TEJA NEWS