ఏళ్లకు ఏళ్లు గడిచినా చాలా కేసులు కొలిక్కిరావడం లేదు

ఏళ్లకు ఏళ్లు గడిచినా చాలా కేసులు కొలిక్కిరావడం లేదు

TEJA NEWS

హైదరాబాద్‌: తెలంగాణ ఆబ్కారీశాఖలో ఏళ్లకు ఏళ్లు గడిచినా చాలా కేసులు కొలిక్కిరావడం లేదు. కొన్ని కేసులైతే 1995 నుంచి అపరిష్కృతంగానే ఉన్నాయి. ఇలా ఏకంగా 18 వేల కేసులు దర్యాప్తు దశ దాటకపోవడం విడ్డూరం. గుడుంబా, నకిలీ మద్యం నుంచి మాదకద్రవ్యాల కేసుల వరకు అన్నిటిదీ ఇదే పరిస్థితి. దర్యాప్తు పూర్తయినా, అభియోగపత్రాలు నమోదు చేయనివి కొన్ని.. దర్యాప్తు సరిగా లేక విచారణానంతరం వీగిపోయే కేసులు మరికొన్ని. దీనివల్ల నిందితుల్లో భయం లేకుండా పోతోందనే వాదన వినిపిస్తోంది. మాదకద్రవ్యరహిత తెలంగాణ దిశగా కఠినచర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించిన నేపథ్యంలో ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం డైరెక్టర్‌గా ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన ఐపీఎస్‌ వి.బి.కమలాసన్‌రెడ్డి ప్రామాణిక కార్యాచరణ విధానం (ఎస్‌వోపీ) రూపొందించారు. ఇందులో భాగంగా పాత దస్త్రాల బూజు దులపడంతో.. వేల సంఖ్యలో అపరిష్కృత కేసులున్నట్లు వెల్లడైంది. వీటిని త్వరగా కొలిక్కి తీసుకొచ్చేలా ఆబ్కారీ స్టేషన్ల వారీగా లక్ష్యాలు విధించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 139 స్టేషన్లలో అపరిష్కృత కేసుల దర్యాప్తు పూర్తి చేసి న్యాయస్థానంలో అభియోగపత్రాలు దాఖలు చేయాలని ఆదేశించారు. పెండెన్సీని 20 శాతం లోపునకు తగ్గించాలని నిర్దేశించారు.

సూత్రధారుల్ని పట్టుకునేలా ప్రణాళిక

యువతను పెడదోవ పట్టిస్తున్న గంజాయి మహమ్మారిపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం ప్రత్యేకంగా దృష్టి సారించింది. గంజాయి విక్రయిస్తూ లేదా సరఫరా చేస్తూ చిక్కిన నిందితులను అరెస్టు చేసి ఊరుకోకుండా.. దర్యాప్తులో మరింత ముందుకెళ్లాలని నిర్ణయించింది. నిందితులకు గంజాయి ఎక్కడి నుంచి ఎవరు చేర్చారనే విషయాలపై కూపీ లాగుతోంది. అవసరమైతే గంజాయి సాగు చేసే ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లోకి బృందాలను పంపే యోచనలో ఉంది. అలా కీలక సూత్రధారుల్ని పట్టుకుని.. కఠినశిక్షలు పడేలా అభియోగపత్రాలు రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకుంది

Print Friendly, PDF & Email

TEJA NEWS