TEJA NEWS

కొనుగోలు కేంద్రాలలో రంగు మారి మొలకెత్తుతున్న వరి ధాన్యం ఎవరికీ పట్టని రైతు గోస
ట్రాన్స్ పోర్టు కాంట్రాక్ట్ పెద్ద కుంభకోణం*లారీలు లేకున్నా పైరవీలతో కాంటాక్ట్
*
నెలలు గడుస్తున్న తరలించని వరి ధాన్యం
—- బీసీ పొలిటికల్ జెఎసి స్టేట్ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్

వనపర్తి : ఆరుగాలం శ్రమించి పండించిన పంట కొనుగోలు కేంద్రాల వద్ద వర్షాలకు తడిసికళ్ళముందే రంగు మారి మొలకెత్తుతుంటే రైతులు పడుతున్న గోస ఎవరికి పట్టడం లేదని బిసి పొలిటికల్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు.

జిల్లాలోని శ్రీరంగాపురం మండలంలో గల వరి కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించి వరి ధాన్యం రాశులను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీరంగాపురం మండలంలో అధికారులు ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులు పడుతున్న ఇబ్బందులను కళ్ళు తెరిచి చూడాలని అన్నారు.

నెల రోజులకు పైగా కొనుగోలు కేంద్రానికి రైతులు తీసుకొచ్చిన వరి ధాన్యాన్ని తరలించకపోవడం వల్ల ధాన్యం రంగు మారి మొలకెత్తుతుందని అన్నారు.

ట్రాన్స్ పోర్టు కాంట్రాక్ట్ పద్ధతిలో లారీలు పంపిణీ చేయడం కోసం అనుమతి పొందిన వ్యక్తులతో నిజంగా లారీలు ఉంటే ఎందుకు ధాన్యం తరలించడం లేదని ప్రశ్నించారు.

కేవలం తమకు ఉన్న పలుకుబడితో పైరవీలు చేసి ట్రాన్స్ పోర్టు కాంట్రాక్ట్ పొందడం వల్ల నేడు ఈ పరిస్థితి ఉత్పన్నమవుతుందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

రైతుల దీనస్థితి ఏ పార్టీ నాయకుడికి పట్టడం లేదని, రైతులను కేవలం ఓటు బ్యాంకుగా ఉపయోగించుకుంటున్నారని, రైతులు పండించిన ధాన్యం మొలకెత్తుతుంటే ప్రతిపక్ష పార్టీల నాయకులు కళ్ళు మూసుకున్నారా అంటూ ప్రశ్నించారు.

మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి జిల్లా అధికార యంత్రాంగంతో చేసిన సమీక్ష సమావేశం కేవలం నీటి మీద బుడగ లాగే మారిందన్నారు.

మంత్రి సొంత నియోజకవర్గంలోనే తరుగు పేరుతో రైతులను నిలువు దోపిడీ చేస్తుంటే పట్టించుకునే నాధుడే లేకపోవడం దురదృష్టకరమన్నారు.

ఇకనైనా సివిల్ సప్లయ్ అధికారులు మొద్దునిద్ర వీడి రైతులు పడుతున్న గోసను వెంటనే తీర్చాలని, లేదంటే బీసీ పొలిటికల్ జేఏసీ తరఫున రైతులను సమీకరించి ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో బీసీ పొలిటికల్ జెఎసి రాష్ట్ర కార్యదర్శి వివి గౌడ్ జిల్లా అధ్యక్షుడు వనం తిరుపతయ్య యాదవ్, మండల అధ్యక్షులు ధర్మేంద్ర సాగర్ ప్రధాన కార్యదర్శి అస్కని రమేష్, కొత్తకోట మండల అధ్యక్షుడు అంజన్న యాదవ్, జిల్లా కార్యదర్శి బత్తుల జితేందర్, రవి నాయుడు, బాలచంద్రయ్య, రవి సాగర్,రాధాకృష్ణ మరియు రైతులు పాల్గొన్నారు.