TEJA NEWS
  • రైతు వేదికల్లో రైతు నేస్తం కార్యక్రమాన్ని, భూభారతి సదస్సులను రైతులు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి విజ్ఞప్తి

వనపర్తి
ప్రతి మంగళవారం ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వ విద్యాలయం ద్వారా నిర్వహించే రైతు నేస్తం వ్యవసాయ కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు.
మంగళవారం జిల్లా కలెక్టర్ పెబ్బేరు మండలం కంచిరావు పల్లి గ్రామ రైతు వేదికలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహిస్తున్న రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతు నేస్తం 57వ ఎపిసోడ్ లో రైతులు సేంద్రీయ ఎరువులు ఏ విధంగా తయారు చేసుకోవచ్చు, సేంద్రియ ఎరువును ఏవిధంగా ఉపయోగించాలి వాటి వల్ల రైతులకు కలగే లాభాలు ఏంటి అనేది వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులకు వివరించారు. అదేవిధంగా వివిధ రకాల పంటల సాగు, మెళుకువలు, రైతుల సందేహాలను విని నివృత్తి చేశారు. ఇంత మంచి కార్యక్రమాన్ని రైతులు ప్రతి మంగళవారం రైతు వేదికకు వచ్చి సద్వినియోగం చేసుకొని పంటల సాగు పై అవగాహన పొందాలని సూచించారు. రైతు వేదికల్లో నిర్వహించే రైతు నేస్తం కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించేందుకు వ్యవసాయ శాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ప్రభుత్వం ద్వారా సన్న రకం వడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తుందని అందువల్ల
రైతులు దొడ్డు రకం వడ్లు కాకుండా సన్న రకం వడ్లు మాత్రమే పండించాలని సూచించారు.
అంతకు ముందు కంచిరావు పల్లి గ్రామంలోని మహేశ్వర ట్రేడర్స్ విత్తనాల షాపును కలెక్టర్ తనిఖీ చేశారు. ట్రేడర్ లైసెన్స్ కాపీ, స్టాక్ రిజిస్టరు పరిశీలించారు. స్టాక్ లో ఉన్న విత్తనాలను పరిశీలించి రైతులకు ఎంత ధరకు అమ్ముతున్నారని ప్రశ్నించారు. ఎరువుల నిల్వలను సైతం పరిశీలించారు. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచుకొని సరఫరా చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అవని సీడ్స్ వరి విత్తనాలు 30 కిలోల బ్యాగు ఉంటుందని, బ్యాగు కు రూ. 1200 చొప్పున అంటే కిలో రూ. 40 చొప్పున అమ్ముతున్నట్లు ట్రేడర్ వివరించారు.
అనంతరం షాకాపూర్ గ్రామ రైతు వేదికలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సును కలెక్టర్ సందర్శించారు. ఏ గ్రామంలో రెవెన్యూ సదస్సు ఎప్పుడూ నిర్వహించనున్నారో ముందే ప్రజలకు సమాచారం ఇవ్వడం, గ్రామంలో టామ్ టామ్ చేయించడం జరుగుతుందని అందువల్ల భూ సమస్యలు ఉన్న రైతులు వేరే ప్రాంతాల్లో ఉన్నా బంధువులు వారికి ఫోన్. చేసి పిలిపించుకొని భూ సమస్యలు పరిష్కరించుకోవాలని ప్రజలకు సూచించారు. భూ సమస్యలు ఏమున్నా నిర్ణిత నమూనా దరఖాస్తులోనే ఇవ్వాలని, రైతులకు కాకుంటే ఫారం నింపేందుకు రెవెన్యూ సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. ప్రజల నుండి వచ్చే దరఖాస్తులను రెవెన్యూ అధికారులు క్షుణ్ణంగా అర్థం చేసుకొని అవసరమైన వాటికి సదస్సులోనే అందరిముందు పంచనామ చేసి నోటీసులు జారి చేశాక నెల రోజుల్లో పరిష్కరించడం జరుగుతుందన్నారు. మరికొన్ని అక్కడే పరిష్కారం అవుతాయన్నారు. అందువల్ల ప్రజలు రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఆర్డిఓ సుబ్రమణ్యం, డి. టి నందకిశోర్, ఆర్.ఐ. రాఘవేంద్ర , మండల వ్యవసాయ అధికారి షేక్ మున్నా, రైతులు తదితరులు పాల్గొన్నారు.