వర్షాకాలంలో పశువుల ఆరోగ్యంపై రైతులు అప్రమత్తంగా ఉండాలి

TEJA NEWS

వర్షాకాలంలో పశువుల ఆరోగ్యంపై రైతులు అప్రమత్తంగా ఉండాలి

– డా. వేణుగోపాల్ రావు, సీనియర్ వెటర్నరీ వైద్యాధికారి.

ఉమ్మడి నల్గొండ జిల్లా : వర్షాకాలంలో పశువుల ఆరోగ్య సంరక్షణ విషయంలో రైతులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూర్యాపేట మండలం, టేకుమట్ల గ్రామ పశువైద్యశాల సీనియర్ వెటర్నరీ వైద్యాధికారి డా. వేణుగోపాల్ రావు సూచించారు. వర్షాల కారణంగా పశువుల కొట్టాల్లో తేమ, బురద, అపరిశుభ్ర వాతావరణం ఏర్పడి వైరస్‌లు, బ్యాక్టీరియా, పరాన్నజీవులు వేగంగా వ్యాపించే అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. ముఖ్యంగా గాలికుంటు, గొంతువాపు (హెచ్.ఎస్), బ్లాక్ క్వార్టర్ (బి.క్యు), కడుపులో పురుగులు, చర్మవ్యాధులు వంటి వ్యాధులు ఈ కాలంలో ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉందన్నారు. పశువుల కొట్టాలను ప్రతిరోజూ శుభ్రపరచడంతో పాటు వర్షపు నీరు నిల్వ లేకుండా చూడాలని, తడిసిన లేదా బూజు పట్టిన మేతను పశువులకు వేయకూడదని సూచించారు.

పరిశుభ్రమైన తాగునీరు, పౌష్టికాహారం అందించడం ద్వారా పశువుల రోగనిరోధక శక్తి పెరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం నిర్వహించే టీకాల కార్యక్రమాలను రైతులు తప్పకుండా వినియోగించుకోవాలని, పశువులకు నిర్ణీత సమయంలో టీకాలు వేయించడం, డీవార్మింగ్ చేయించడం ద్వారా అనేక అంటువ్యాధులను నివారించవచ్చని పేర్కొన్నారు. పశువులకు జ్వరం, ఆకలి మందగించడం, నోటి నుంచి లాలాజలం కారడం, కుంటుతూ నడవడం, విరేచనాలు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప పశువైద్యశాలను సంప్రదించాలని సూచించారు. స్వయంగా మందులు వాడకుండా పశువైద్యుల సలహా మేరకే చికిత్స చేయించాలని కోరారు. వర్షాకాలంలో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకుంటే పశువులను వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోవడంతో పాటు పాల ఉత్పత్తి, పశువుల ఉత్పాదకత కూడా మెరుగుపడుతుందని డా. వేణుగోపాల్ రావు తెలిపారు.

You cannot copy content of this page

Scroll to Top