
మంథనిలో అభివృద్ధి పనులపై క్షేత్రస్థాయి తనిఖీ…
నిర్ణీత గడువులో నాణ్యతతో పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం…
మంథనిలో అభివృద్ధి పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష…
పెద్దపల్లి//జిల్లా ప్రతినిథి:
మంథని పట్టణంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. మంథనిలో చేపడుతున్న పలు అభివృద్ధి పనులను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించి పనుల పురోగతిని సమీక్షించారు.
ఈ సందర్భంగా నిర్మాణంలో ఉన్న మార్కెట్ ఏరియా, సమీకృత ప్రభుత్వ కార్యాలయాల సముదాయం, నూతన ప్రభుత్వ ఆసుపత్రి, రావులచెరువు పునరుద్ధరణ పనులు, చెరువు సమీపంలో చేపడుతున్న డ్రైనేజీ నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. ప్రస్తుతం వర్షాలు లేకపోవడంతో పనులకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నిర్ణీత గడువులో నాణ్యతా ప్రమాణాలతో పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
మంథని మార్కెట్ ఏరియాలో 100 అడుగుల రహదారి నిర్మాణాన్ని వేగవంతం చేయడంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందేలా అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు.
రావులచెరువు పునరుద్ధరణ పనులను నాణ్యతతో పూర్తి చేయాలని, ముఖ్యంగా డ్రైనేజీ నీరు ఎట్టి పరిస్థితుల్లోనూ చెరువులోకి చేరకుండా శాశ్వత ప్రాతిపదికన డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.
అనంతరం జిల్లాలోని సుమారు 40 వేల మంది విద్యార్థులకు ప్రతిరోజూ అల్పాహారం, భోజనం అందించే కార్యక్రమం కోసం ఏర్పాటు చేస్తున్న హరే కృష్ణ గోదాములను పరిశీలించారు. నిల్వ సదుపాయాలు, పంపిణీ వ్యవస్థ, ఇతర మౌలిక వసతులు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కార్యక్రమాన్ని సకాలంలో ప్రారంభించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
ఈ తనిఖీల్లో మంథని మున్సిపల్ చైర్మన్ వి. శ్రీనివాస్, వైస్ చైర్మన్ సయేందర్ రెడ్డి, కౌన్సిలర్ పెంటరాజు, ఆర్డీవో సురేష్, తహసీల్దార్ ఆరిఫుద్దీన్, మున్సిపల్ కమిషనర్ మనోహర్, సంబంధిత శాఖల అధికారులు, ఇంజినీర్లు తదితరులు పాల్గొన్నారు.