
మార్చి–2027 నాటికి మూడు విడతల్లో పూర్తి చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశం…
భూ భారతి అమలు, సాదాబైనామా దరఖాస్తులు, ఇందిరమ్మ ఇళ్లు, 2బీహెచ్‌కే పంపిణీపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్
పెద్దపల్లి//జిల్లా ప్రతినిథి:
భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు భూ భారతి చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలంటే రాష్ట్రవ్యాప్తంగా భూ రీ-సర్వేను అత్యంత ప్రాధాన్యతతో చేపట్టాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
ఖమ్మం సమీకృత కలెక్టరేట్ నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి భూ రీ-సర్వే, భూ భారతి అమలు, సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, 2బీహెచ్‌కే ఇళ్ల పంపిణీ, విద్యార్థుల యూనిఫాంల పంపిణీ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ నుంచి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డి.ఎస్. లోకేష్ కుమార్ పాల్గొనగా, పెద్దపల్లి సమీకృత జిల్లా కలెక్టరేట్ (ఐడీఓసీ) నుంచి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.
మంత్రి మాట్లాడుతూ, ధరణి స్థానంలో తీసుకొచ్చిన భూ భారతి చట్టం విజయవంతమైన అమలుకు భూ రీ-సర్వే కీలకమని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా శిక్షణ పొందిన 5,700 మంది లైసెన్స్ సర్వేయర్ల సేవలను వినియోగించుకుని, రెగ్యులర్ సర్వేయర్లతో సమన్వయంగా పనిచేయాలని సూచించారు. మార్చి–2027 నాటికి మూడు విడతల్లో భూ రీ-సర్వే పూర్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
రీ-సర్వేలో పనిచేసే లైసెన్స్ సర్వేయర్లకు ఎకరానికి రూ.50తో పాటు రవాణా, ఇతర ఖర్చుల కోసం మరో రూ.10 చెల్లించి మొత్తం రూ.60 అందజేస్తామని తెలిపారు. జూలై 28లోపు విధుల్లో చేరని లైసెన్స్ సర్వేయర్ల లైసెన్సులను రద్దు చేయాలని ఆదేశించారు. అలాగే వారికి బీమా, సామాజిక భద్రత కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
ధరణి కాలంలో పెండింగ్‌లో ఉన్న సాదాబైనామా దరఖాస్తులను నిబంధనల ప్రకారం త్వరితగతిన పరిష్కరించాలని, ప్రజల్లో ఉన్న సందేహాలను నివృత్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఒక సర్వే నంబరులో కొంత భూమి మాత్రమే ప్రభుత్వ అవసరాలకు సేకరించినప్పటికీ మొత్తం భూమిని నిషేధిత జాబితాలో ఉంచడం వంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేసి, రెండో విడత లబ్ధిదారుల ఎంపికను త్వరగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. గుడిసెల్లో నివసించే కుటుంబాలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని, పెండింగ్‌లో ఉన్న 2బీహెచ్‌కే ఇళ్లను లబ్ధిదారులకు త్వరగా అందించాలని సూచించారు. నిధులు విడుదలైనప్పటికీ పనులు చేపట్టని చోట్ల బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.
విద్యార్థుల సంక్షేమంపై కూడా మంత్రి ప్రత్యేక దృష్టి సారించారు. ఆగస్టు 15 నాటికి రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికి కనీసం ఒక జత యూనిఫాం అందేలా కలెక్టర్లు, సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా రెవెన్యూ అధికారి రాజేశ్వరి, రెవెన్యూ డివిజనల్ అధికారులు బి. గంగయ్య, సురేష్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారులు, ఇతర సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.