
పెద్దపల్లి అభివృద్ధికి కేంద్రంపై ఒత్తిడి కొనసాగిస్తాం.. సింగరేణి పరిరక్షణే మా లక్ష్యం….
–ఎంపీ గడ్డం వంశీకృష్ణ…
పెద్దపల్లి//జిల్లా ప్రతినిథి:గోదావరిఖని, పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి, సింగరేణి పరిరక్షణ, కేంద్ర ప్రభుత్వ వైఖరిపై పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ గోదావరిఖని ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో పలు కీలక అంశాలను ప్రస్తావించారు.
గత రెండేళ్లుగా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ సమస్యలను పార్లమెంట్‌లో నిరంతరం లేవనెత్తుతూ, వాటి పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు సుమారు రూ.8,000 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు పేర్కొన్నారు. రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు , రోడ్ ఓవర్ బ్రిడ్జిలు నిర్మాణానికి రూ.500 కోట్ల నిధులు కేటాయించేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు.
గోదావరిఖని ఈఎస్‌ఐ ఆసుపత్రి నిర్మాణానికి రూ.150 కోట్ల నిధులు కేటాయించే దిశగా కృషి చేస్తున్నామని, సింగరేణి రిటైర్డ్ కార్మికులకు నెలకు రూ.10 వేల పెన్షన్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఒత్తిడి తెచ్చినట్లు వెల్లడించారు.
సింగరేణి ప్రాంతంలోని బొగ్గు గనులను సింగరేణికే కేటాయించాలని పార్లమెంట్‌లో కేంద్ర మంత్రిని ప్రశ్నించినట్లు తెలిపారు. తాడిచెర్ల కోల్ బ్లాక్–2ను సింగరేణికి కేటాయిస్తే సంస్థ మరింత ఆర్థికంగా బలోపేతం అవుతుందని అన్నారు.
సింగరేణి బొగ్గు బ్లాక్‌లను ప్రైవేట్ సంస్థలకు అప్పగించిన సమయంలో బీఆర్ఎస్, బీజేపీ ఎంపీలు పార్లమెంట్‌లో ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. ఎన్నికల సమయంలో మతపరమైన అంశాలతో కాంగ్రెస్‌పై విమర్శలు చేసిన బీజేపీ నాయకులు, అయోధ్యలో జరిగిన భారీ విలువైన బంగారు ఆభరణాల దొంగతనం ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
నీట్ పరీక్షల నిర్వహణలో జరిగిన అవకతవకలపై కూడా కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈఎస్‌ఐ ఆసుపత్రి, ఎయిర్‌పోర్ట్ వంటి కీలక ప్రాజెక్టుల విషయంలో రాజకీయ కుట్రలు జరుగుతున్నాయని, తెలంగాణకు రావాల్సిన పలు అభివృద్ధి ప్రాజెక్టులను బీజేపీ అడ్డుకుంటోందని ఆరోపించారు.
పెద్దపల్లి ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వమ్ము చేయబోనని, కేంద్ర ప్రభుత్వంపై నిరంతరం ఒత్తిడి తీసుకువస్తూ నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తానని ఎంపీ గడ్డం వంశీకృష్ణ స్పష్టం చేశారు.