మత్తు పదార్థాలు, సైబర్ నేరాలకు దూరంగా ఉండాలి….

TEJA NEWS

మత్తు పదార్థాలు, సైబర్ నేరాలకు దూరంగా ఉండాలి….

పిల్లలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ అత్యంత కీలకం…

— ఏసీపీ ఎం. రమేష్…

పెద్దపల్లి//జిల్లా ప్రతినిథి: మంథని, విద్యార్థులు మత్తు పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలని, సామాజిక మాధ్యమాలను బాధ్యతాయుతంగా వినియోగిస్తూ సైబర్ నేరాల పట్ల ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్ సూచించారు.

రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జోన్ పరిధిలోని మంథని పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో మంథని గురుకుల పాఠశాలలో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల కోసం మత్తు పదార్థాల దుష్ప్రభావాలు, సామాజిక మాధ్యమాల ప్రభావం, సైబర్ నేరాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏసీపీ ఎం. రమేష్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పిల్లలను సరైన మార్గంలో తీర్చిదిద్దే బాధ్యతలో తల్లిదండ్రుల పాత్ర అత్యంత కీలకమని అన్నారు. చిన్నప్పటి నుంచే మంచి విలువలు, క్రమశిక్షణ, బాధ్యతాయుతమైన జీవన విధానాన్ని అలవర్చాలని సూచించారు. పిల్లలు బెదిరింపులకు పాల్పడినా భయపడకుండా ప్రేమతో పాటు క్రమశిక్షణతో వారిని సరైన దారిలో నడిపించాలని తల్లిదండ్రులకు సూచించారు.

ప్రతిరోజూ పిల్లలతో మాట్లాడడం, వారి స్నేహితుల వర్గం, మొబైల్ ఫోన్ వినియోగం, సామాజిక మాధ్యమాల వినియోగాన్ని పర్యవేక్షించడం ద్వారా చెడు అలవాట్ల నుంచి వారిని కాపాడవచ్చని పేర్కొన్నారు.

మత్తు పదార్థాల అలవాటు విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తుందని హెచ్చరిస్తూ, వాటికి పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు. సామాజిక మాధ్యమాలను అవసరమైన మేరకే ఉపయోగించాలని, అధిక వినియోగం చదువుపై ఏకాగ్రతను తగ్గించడంతో పాటు మానసిక ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుందని వివరించారు.

సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో అపరిచితుల ఫోన్ కాల్స్, సందేశాలు, లింకులు, నకిలీ వెబ్‌సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వ్యక్తిగత బ్యాంకు వివరాలు, ఓటీపీలు, పాస్‌వర్డ్‌లు ఎవరికీ వెల్లడించవద్దని, అనుమానాస్పద సంఘటనలు ఎదురైతే వెంటనే పోలీసులకు లేదా సైబర్ హెల్ప్‌లైన్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు.

విద్యార్థులు స్పష్టమైన లక్ష్యంతో చదువుకుని సమాజానికి ఆదర్శప్రాయమైన పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో మంథని ఎస్‌ఐ, పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top