
క్యాన్సర్ బాధితుడికి రూ.15లక్షల ఎల్.వో.సీ అందించిన మాజీమంత్రి ప్రత్తిపాటి
- బాధితుడి కుటుంబసభ్యులకు దైర్యం చెప్పి, ప్రభుత్వం నుంచి మరింత సాయం అందేలా చూస్తామన్న మాజీమంత్రి.
- గత ప్రభుత్వం సీఎం.ఆర్.ఎఫ్ సాయం నిలిపేసి, పేదల మరణాలకు కారణమైందన్న పుల్లారావు
దిగజారిన కుటుంబ ఆర్థిక పరిస్థితికి తోడు, క్యాన్సర్ (లింఫోమా) తో బాధపడుతున్న వ్యక్తికి మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ప్రభుత్వం మంజూరుచేసిన రూ.15లక్షల ఎల్.వో.సీని అందించారు. పట్టణ శివార్లలోని ఎన్టీఆర్ నగర్ లోని టిడ్కో గృహాల్లో నివసిస్తున్న కనుమూరి శ్రీనివాసరావును స్వయంగా పరామర్శించిన ప్రత్తిపాటి కుటుంబసభ్యులకు ఎల్.వో.సీ అందించారు.
ఈ సందర్భంగా మాజీమంత్రి మాట్లాడుతూ..
క్యాన్సర్ బాధితుడు శ్రీనివాసరావు సోదరుడు కనుమూరి సత్యం ఎన్నోఏళ్లుగా టీడీపీలో నిబద్ధతతో పనిచేస్తున్నాడన్నారు. కార్యకర్త కుటుంబానికి అండగా నిలవాల్సిన బాధ్యత తనపై ఉందన్న ప్రత్తిపాటి, ప్రభుత్వం నుంచి శ్రీనివాసరావుకు మెరుగైన వైద్యచికిత్స అందేలా చూస్తామని చెప్పారు.గత ప్రభుత్వం ఈ విధమైన ప్రజల అనారోగ్య సమస్యలను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ప్రత్తిపాటి తెలిపారు. ముఖ్యమంత్రి సహాయ నిది (సీఎం.ఆర్.ఎఫ్) సాయం పూర్తిగా నిలిపివేసి, ఎంతోమంది పేదల మరణాలకు కారణమైందన్నారు. శ్రీనివాసరావు త్వరగా కోలుకొని, తన కుటుంబానికి మునుపటిలా అండగా నిలవాలని ప్రత్తిపాటి ఆకాంక్షించారు.
శ్రీనివాసరావు సోదరుడు సత్యం మాట్లాడుతూ..
తన సోదరుడి వైద్య ఖర్చులు ప్రభుత్వం భరించేలా చేసిన శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావుకి కృతజ్ఞతలు తెలియచేస్తున్నానన్నారు. తమ్ముడు శ్రీనివాసరావు వైద్యచికిత్సకు ఇప్పటివరకు రూ.10లక్షలు వెచ్చించామని, కుటుంబ ఆర్థికపరిస్థితి బాగాలేక ఏంచేయాలో తెలియని స్థితిలో ఎమ్మెల్యేని కలిసి సమస్య చెప్పుకున్నామని సత్యం తెలిపారు. ఎమ్మెల్యే సూచనతో ప్రభుత్వ సాయానికి దరఖాస్తు చేసుకున్నామని, ఆయనే హైదరాబాద్ లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి వారితో మాట్లాడి, వైద్యసాయం, ప్రభుత్వ సాయం అందేలా చూశారని సత్యం చెప్పారు.
