TEJA NEWS

అనుమతి ఉంటే మంటపానికి ఉచిత విద్యుత్

గ‌ణేష్ ఉత్స‌వ స‌మితి స‌మీక్ష‌లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి_

హైద‌రాబాద్ : హైదరాబాద్ నగరం తొలినాళ్ల నుంచి మ‌త సామ‌ర‌స్యానికి, ప్ర‌శాంత‌త‌కు పేరు పొందింద‌ని, ఆ ఇమేజ్‌ను మ‌రింత పెంచేలా గ‌ణేష్ ఉత్స‌వాల నిర్వ‌హ‌ణ ఉండాల‌ని, ఇందుకోసం ఉత్స‌వ క‌మిటీలు, మండప నిర్వాహ‌కులు, అధికారులు స‌మ‌న్వ‌యంతో ముందుకు సాగాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. గణేష్ ఉత్సవాల నిర్వహణపై రాష్ట్ర స‌చివాల‌యంలో గురువారం ఆయన స‌మీక్ష నిర్వ‌హించారు.
మండ‌పాల ఏర్పాటు, తొమ్మిది రోజుల ఉత్స‌వాల నిర్వ‌హ‌ణ, నిమ‌జ్జ‌నానికి సంబంధించి మండ‌ప నిర్వాహ‌కులు బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించాల‌ని, ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లోనో అనుమ‌తులు తీసుకోవాల‌ని ముఖ్యమంత్రి సూచించారు. ప్ర‌భుత్వం త‌ర‌ఫున పోలీసు, జీహెచ్ఎంసీ, ఆర్ అండ్ బీ, నీటి పారుద‌ల శాఖ‌, విద్యుత్ శాఖ‌తో పాటు ఇత‌ర ముఖ్య శాఖ‌ల అధికారులు సైతం మండ‌ప నిర్వాహ‌కులతో స‌మ‌న్వ‌యంతో ముందుకు సాగాల‌న్నారు. నిమ‌జ్జ‌న మహోత్సవాన్ని పకడ్బందీగా నిర్వహించాలన్నారు. ఎటువంటి లోటుపాట్ల‌కు తావు ఇవ్వొద్దని సీఎం హెచ్చ‌రించారు.
గణపతి ఉత్స‌వాల నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి గ్రేటర్ ప‌రిధిలోని న‌లుగురు లోక్‌స‌భ స‌భ్యులు, ఎమ్మెల్యేల అభిప్రాయాల‌ను తీసుకోవాల‌ని ముఖ్య‌మంత్రి పోలీసుల‌కు సూచించారు. సెప్టెంబ‌రు 16న మిలాద్ ఉన్ న‌బి, 17న తెలంగాణ‌లో వివిధ రాజ‌కీయ పార్టీలు ప‌లు కార్య‌క్ర‌మాలు చేప‌డ‌తాయ‌ని, అందువ‌ల‌న అన్ని కార్య‌క్ర‌మాల‌కు స‌క్ర‌మ‌మైన ప్ర‌ణాళిక‌తో ముందుకు సాగాల‌ని, ఎక్క‌డా ఎటువంటి స‌మ‌స్య త‌లెత్త‌కుండా చూసుకోవాల‌ని పోలీసుల‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు.
గ‌ణేష్ మండ‌పాల‌కు ఉచిత విద్యుత్ ఇవ్వాల‌ని భాగ్య‌న‌గ‌ర్ గ‌ణేష్ ఉత్స‌వ స‌మితి స‌భ్యులు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞ‌ప్తి చేశారు. అందుకు ముఖ్య‌మంత్రి సానుకూలంగా స్పందించారు. ముందుగా మండ‌ప నిర్వాహ‌కులు ఉచిత విద్యుత్ స‌ర‌ఫ‌రాకు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సూచించారు. అనుమ‌తులు లేకుండా విద్యుత్ వినియోగిస్తే చ‌ట్ట‌ప్ర‌కారం చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని, జ‌వాబుదారీత‌నం కోస‌మే అనుమ‌తి చేసుకోవాల‌ని కోరుతున్నామ‌ని తెలిపారు. మండపాల్లో డీజే సౌండ్లు వంటి అంశాల్లో సుప్రీంకోర్టు నిబంధ‌న‌ల ప్ర‌కారం ముందుకు వెళ‌తామ‌ని ముఖ్య‌మంత్రి తెలిపారు.
ఈ స‌మావేశంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు, దామోద‌ర రాజ‌న‌ర‌సింహ‌ , పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి , సీత‌క్క‌, ముఖ్య‌మంత్రి స‌ల‌హాదారు వేం న‌రేంద‌ర్ రెడ్డి, ప్ర‌భుత్వ స‌ల‌హాదారులు కేశ‌వ‌రావు, ష‌బ్బీర్ అలీ, ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి , మేయ‌ర్ గద్వాల విజయ‌ల‌క్ష్మి, ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతికుమారి, పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


TEJA NEWS