
క్యాన్సర్ గురించి పూర్తిగా తెలుసుకోండి
** బాలాయపల్లి వైద్యాధికారి డాక్టర్ లియోన
తిరుపతి: స్విమ్స్ ఆధ్వర్యంలో నడుస్తున్న
పింక్ బస్సుల ద్వారా ప్రతి ఒక్కరూ క్యాన్సర్ పై అవగాహన పెంచుకుని, వ్యాధి నుంచి రక్షణ పొందాలని బాలాయపల్లి వైద్యాధికారి డాక్టర్ లియోన కోరారు. తిరుపతి శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ(స్విమ్స్) ఆధ్వర్యంలో మంగళవారం బాలాయపల్లి పిహెచ్ సి పరిధిలోని పిగిలాం, కామకూరు గ్రామాల్లో పింక్ బస్సుల ద్వారా ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సహకారంతో తిరుపతి జిల్లాలో రెండు పింక్ బస్సుల ద్వారా మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వేగవంతంగా జరుగుతోంది. బిపి, షుగరు పరీక్షలతోపాటు పింక్ బస్సులో మహిళలు, పురుషులకు నోటి క్యాన్సర్ పరీక్షలు, మహిళలకు రొమ్ము క్యాన్సర్ నిర్ధారణకు మామోగ్రామ్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నిర్ధారణ కోసం పాప్ స్మియర్ పరీక్షలను ఉచితంగా నిర్వహించారు. మహిళలు, పురుషులు విశేషంగా విచ్చేసి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకున్నారు.
పింక్ బస్సుల క్యాంపులు జరిగే ప్రదేశాలు..
- 5న కాట్రగుంట, ఊట్లపల్లి.
- 6న కయ్యూరు, విఎం.పురం.
- 9న కోటంబేడు.
స్విమ్స్ డైరెక్టర్ కమ్ వైస్ చాన్సలర్ డాక్టర్ ఆర్వీ కుమార్ ఆదేశాల మేరకు కమ్యూనిటి మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ కె.నాగరాజ్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమాల్లో స్విమ్స్ మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ పద్మావతి, డాక్టర్ చైతన్య భాను, సర్పంచులు ఎం.వెంకటేశ్వర్లు, ఎం.కృష్ణ, పంచాయతీ కార్యదర్శులు ఎ.అశోక్ రెడ్డి, పి.బాలాజీ రావు, స్థానిక నాయకులు పెద్ద వెంకటేశ్వర్లు, శేషం నాయుడు, సిహెచ్ వోలు మాధవి, కల్యాణి, ఏఎన్ఎంలు కె.విజయలక్ష్మి, ఎం.మహిత, స్థానిక వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
