Give one chance and win as MLC candidate
నిరుద్యోగుల సమస్య పరిష్కారానికి కృషి
◆ జాబ్ క్యాలెండర్ విడుదలకు సిద్ధం
◆ పరిశ్రమల్లో స్థానికులకు 80% ఉద్యోగాలు
◆ ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి ఐతగోని రాఘవేంద్ర గౌడ్
…….
తెలంగాణ రాష్ట్రంలో గత పదేళ్లుగా పట్టిపీడిస్తున్న నిరుద్యోగ సమస్యకు పరిష్కారం కావాలంటే నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు ఒక్కసారి అవకాశం ఇచ్చి గెలిపించాలని ఐతగోని రాఘవేంద్ర గౌడ్ అన్నారు. ఖమ్మం ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాఘవేంద్ర గౌడ్ మాట్లాడుతూ… అవకాశవాదంగా ఉద్యోగాల పేరుతో రాజకీయ పార్టీలు నిరుద్యోగులను నిలువునా మోసం చేస్తున్నాయని విమర్శించారు. ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేస్తే మార్పు తప్పకుండా వస్తుందన్నారు. గత పదహారేళ్లు జర్నలిస్టుగా ప్రజా సమస్యలపై గళమెత్తుతూ పనిచేస్తున్నానని అన్నారు. ఈనెల 27న జరిగే పట్టభద్రుల ఉపఎన్నికల్లో 20వ నెంబర్ కు మొదటి ప్రాధాన్యతను ఇచ్చి తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తాను గెలిస్తే పరిశ్రమలలో స్థానికులకు 80 శాతం ఉద్యోగ అవకాశాలకు కృషి చేస్తానని, జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని, ప్రభుత్వ టీచర్లకు ప్రమోషన్లు, ట్రాన్స్ పర్ల ప్రక్రియ సజావుగా జరిగే విధంగా కృషి చేస్తానని, ప్రభుత్వ ఉద్యోగులందరికీ పాత పింఛన్ విధానం, జీవో నెంబర్ 46 రద్దుకు కృషి చేస్తానని, అర్హులైన జర్నలిస్టుల అందరికీ ఇంటి నిర్మాణం, 50 లక్షల ప్రమాద బీమా, నెలసరి జీతానికి కృషి చేస్తానని అన్నారు. ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరికీ హెల్త్ కార్డులు, పట్టభద్రులైన నిరుద్యోగులకు కనీస భృతి 10 వేల రూపాయలు ప్రతినెల వచ్చేలా కృషి చేస్తానని తెలిపారు.
ఈ విలేకరుల సమావేశంలో రాకేష్, జయంత్, ఉమేష్, సాయి శివ, డాక్టర్ విద్యా రాణి తదితరులు పాల్గొన్నారు.