
తిరుమలలో హనుమజ్జయంతి వేడుకలు
తిరుపతి : ప్రతి సంవత్సరం వైశాఖ మాసం బహుళ దశమినాడు తిరుమల క్షేత్రంలో ఘనంగా నిర్వహించే హనుమజ్జయంతి వేడుకలు గురువారం 22వ తారీఖున(రేపు )టీటీడీ అత్యంత వైభవంగా నిర్వహించనుంది.
శ్రీవారి ఆలయానికి ఎదురుగానున్న శ్రీ బేడి ఆంజనేయస్వామివారికి, కాలినడకబాటలో ఏడవ మైలు వద్ద ఉన్న శ్రీప్రసన్న ఆంజనేయస్వామి వారికి కూడా హనుమజ్జయంతి నాడు ప్రత్యేక పూజలు జరుగనుంది. తిరుమలలోని జాపాలి తీర్థంలో కూడా హనుమజ్జయంతి ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించబడుతుంది.
ఈ సందర్భంగా సాంప్రదాయానుసారం టీటీడీ తరపున శ్రీ జపాలి హనుమాన్ కు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. కాగా మొదటి ఘాట్‌రోడ్డులోని ఏడవమైలు వద్ద ఉన్న శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామి నిలువెత్తు విగ్రహానికి అదే రోజు సాయంత్రం 3 గంటలకు ప్రత్యేక పూజా కార్యక్రమాలను టీటీడీ నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు టీటీడీ భక్తులు, స్థానికుల సౌకర్యార్థం ఉచిత రవాణా సౌకర్యాన్ని తిరుమల నుండి ఏడో మైలుకు, తిరిగి తిరుమల చేరడానికి కూడా కల్పిస్తున్నది.
