దేశంలో త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఎన్ని కోట్ల మంది ఓటు వేస్తారు? ఎంత శాతం ఓటర్లు పెరిగారు? ఈ అంశాలపై కేంద్ర ఎన్నికల సంఘం సమాచారం వెల్లడించింది. ఈసీ ఎన్నికలకు సిద్ధమైంది. ఈ ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో దాదాపు 97 కోట్ల మంది భారతీయులు ఓటు వేయడానికి అర్హులని తెలిపింది.
18 నుంచి 29 ఏళ్లలోపు యువ ఓటర్లు 2 కోట్ల మందికిపైగా ఓటరు జాబితాలో చేరారని ఈసీ ప్రకటించింది. గత లోక్‌సభ ఎన్నికలు అంటే 2019 నుంచి నమోదైన ఓటర్ల సంఖ్య 6 శాతం పెరిగింది. ప్రపంచంలో ఎక్కువ ఓటర్లు దేశంగా పేర్కొంది. భారత్ రాబోయే సార్వత్రిక ఎన్నికలకు 96.88 కోట్ల మంది ఓటు వేయడానికి నమోదు చేసుకున్నారని ఎన్నికల సంఘం తెలిపింది. 2023లో 940గా ఉన్న లింగ నిష్పత్తి 2024 నాటికి 948కి పెరిగిందని ఎన్నికల సంఘం తెలిపింది. ఓటరు జాబితా సవరణలో పారదర్శకత తీసుకొచ్చామని పేర్కొంది. ఓటరు జాబితా కచ్చితత్వంపై ఈసీ ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. పుణెలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ ఈ వివరాలను వెల్లడించారు. ప్రతి దశలో రాజకీయ పార్టీల భాగస్వామ్యంతోపాటు ఓటరు జాబితా సవరణకు సంబంధించిన వివిధ పనులపై సమాచారం ఇచ్చారు. భారత్ లో ఏప్రిల్ లేదా మేలో లోక్‌సభ ఎన్నికలు జరగవచ్చు. ఇందుకోసం భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎన్నికల సంఘం ఏర్పాట్లలో బిజీబిజీగా ఉంది. మరికొద్ది రోజుల్లో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉంది.