19 కేజీల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ.25 మేర పెంపు
మార్చి 1న ధరలను సవరించిన చమురు కంపెనీలు
విమాన ఇంధన ధరలు కూడా పెంపు
గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరలు యథాతథం
వాణిజ్య కార్యకలాపాల కోసం కమర్షియల్ గ్యాస్ సిలిండర్‌ను వాడుతున్న వినియోగదారులకు కాస్త బ్యాడ్ న్యూస్. 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.25 మేర పెరిగింది. ఈ మేరకు మార్చి 1న (నేడు) చమురు కంపెనీలు ధరలను సవరించాయి. పెరిగిన ధరలు శుక్రవారం (నేడు) నుంచే అమల్లోకి వచ్చాయి. దేశవ్యాప్తంగా వినియోగదారులపై ఈ ప్రభావం పడనుంది. అయితే రాష్ట్రాల వారీగా వేర్వేరు ప్రాంతాల్లోని ట్యాక్సుల ఆధారంగా ధరల్లో స్వల్ప వ్యత్యాసం ఉంటుంది. తాజా పెంపుతో దేశ రాజధాని న్యూఢిల్లీలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రిటైల్ ధర రూ.1795కు పెరిగింది. ఇతర ప్రధాన నగరాలైన కోల్‌కతాలో రూ. 1,911, ముంబైలో రూ. 1,749, చెన్నైలో రూ. 1,960.50లకు ధరలు పెరిగాయి.
అయితే గృహ వినియోగ ఎల్‌పీజీ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదని చమురు కంపెనీలు వెల్లడించాయి. మరోవైపు విమానం ఇంధన ధరలను కూడా కంపెనీలు పెంచాయి. తాజా పెంపుతో కిలోలీటర్ ఏటీఎఫ్(Aviation Turbine Fuel) రూ. 624.37కు చేరిందని ఆయిల్ కంపెనీలు వెల్లడించాయి.