TEJA NEWS

జిల్లాలోని 4,470 ప్రదేశాలలో ఈనెల 21 వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఎలాంటి లోటుపాట్లు లేకుండా సజావుగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు.

సాయంత్రం జిల్లా కలెక్టర్ నగరంలోని తన చాంబర్ నుండి సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి జిల్లా అధికారులు, క్షేత్రాధికారులతో జూమ్ సమావేశం నిర్వహించి యోగాంధ్ర, స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర, తల్లికి వందనం కార్యక్రమాలపై పలు సూచనలు జారీ చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు చేసుకునే విధంగా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్లందరికీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశించారన్నారు.
ఆ ప్రకారం జిల్లాలోని 4,470 ప్రదేశాలలో ఈనెల 21వ తేదీన ప్రభుత్వం నిర్దేశించిన యోగా ప్రోటోకాల్ ను నిర్వహించాలన్నారు.
ప్రతి సచివాలయం పరిధిలో యోగా కార్యక్రమం తప్పనిసరిగా జరగాలన్నారు.
పేర్లు నమోదు చేసుకున్న పౌరులందరూ పాల్గొనేలా చొరవ చూపాలన్నారు.
తాడిగడప, ఉయ్యూరు మున్సిపాలిటీలలో, బంటుమిల్లి, మొవ్వ, నాగాయలంక మండలాల్లో శిక్షణా తరగతులు వెంటనే పూర్తి చేయాలన్నారు.
బంటుమిల్లి, నాగాయలంక, నందివాడ, తోట్లవల్లేరు పమిడిముక్కల మండలాల్లో వేదిక నమోదు ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలన్నారు.
జిల్లాస్థాయి యోగా కార్యక్రమాన్ని ఉయ్యూరులోని విశ్వశాంతి విద్యాసంస్థల ప్రాంగణంలో నిర్వహించడం జరుగుతుందని అక్కడ అన్ని ఏర్పాట్లు పక్కాగా చేయాలన్నారు.

స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం కూడా అదే రోజు నిర్వహించాల్సి ఉన్నందున యోగా కార్యక్రమం పూర్తయ్యాక వేదిక పరిసరాలు అంతా కూడా పరిశుభ్రం చేయాలని, మొక్కలను నాటాలని, స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేయించాలని, స్వచ్ఛ ఆంధ్ర –ఆరోగ్య అంశాలపై సందేశాలు ఇవ్వాలని సూచించారు.
తల్లికి వందనం పథకానికి సంబంధించి జిల్లాలో ఇంకనూ తల్లులు చనిపోయిన కేసులు 409 పెండింగ్లో ఉన్నాయన్నారు. ముఖ్యంగా తాడిగడప, పెడన మున్సిపాలిటీలలో కృత్తివెన్ను మండలంలో ఉన్నాయని, వాటిని సత్వరమే పరిష్కరించాలన్నారు.

సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మ మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులకు స్వచ్ఛ ఆంధ్రపై ముఖ్యంగా యోగ చిత్రలేఖనం పోటీలు నిర్వహించాలని, ప్లాస్టిక్ రహిత వస్తువులను వాడాలన్నారు.
జిల్లాలో స్వర్ణాంధ్ర –స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నప్పటికీ కొందరు అధికారులు సరిగా ఫోటోలు అప్లోడ్ చేయడం లేదన్నారు. ఈసారి అలా జరగకుండా జాగ్రత్తగా పర్యవేక్షించాలన్నారు.
గుర్తించిన యోగ నిర్వహణ ప్రదేశాల వద్ద వేదిక, కార్పెట్, పి ఏ సిస్టం, బ్యానర్లు సిద్ధం చేసుకోవాలని, తాగునీరు, మరుగుదొడ్లు వంటి కనీస సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవాలని, ప్రథమ చికిత్స కోసం వైద్య శిబిరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు.
యోగా కార్యక్రమం నిర్వహించిన తర్వాత అందుకు సంబంధించిన ఫోటోలను అప్లోడ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలన్నారు. ముఖ్యంగా చాలామంది ఒకరు ఇద్దరు యోగ చేస్తున్న ఫోటోలను అప్లోడ్ చేస్తున్నారని అలా కాకుండా యోగాలో పాల్గొన్న వారందరి ఫోటో అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నారు.

ఈ జూమ్ సమావేశంలో జడ్పీ డిప్యూటీ సీఈవో ఆనంద్ కుమార్, డీఈవో పివిజే రామారావు, గ్రామ వార్డు సచివాలయాల జిల్లా సమన్వయకర్త రవికాంత్ తదితర జిల్లా అధికారులు, మునిసిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, డి ఎల్ డి వో లు, మండల ప్రత్యేక అధికారులు, ఈవోపీఆర్డీలు పాల్గొన్నారు

జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి, కృష్ణాజిల్లా మచిలీపట్నం వారిచే జారీ చేయబడినది