TEJA NEWS

ఆడపిల్లలను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉంది

-జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్

ఆడపిల్లలను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. ఈ నెల 24న జాతీయ బాలికా దినోత్సవం పురస్కరించుకుని వైద్య ఆరోగ్య, స్త్రీ శిశు సంక్షేమ శాఖల అధికారులతో నూతన కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శిశు మరణాలు తగ్గించడానికి చట్టాలు పటిష్టంగా అమలుచేయాలన్నారు. జిల్లాలో నమోదైన గర్భిణులలో ఏప్రిల్, 2023 నుండి ఇప్పటి వరకు ఒక అమ్మాయి ఉన్న గర్భిణులు 519 మంది, ఇద్దరు అమ్మాయిలు ఉన్న గర్భిణులు 123 మందికి ఆబార్షన్ లు అయినట్లు, ఇట్టి ఆబార్షన్ లపై సీరియస్ గా విచారణ చేసి, కారణాలు కనుక్కోవాలని, కావాలని, ఆడ పిల్ల అని తెలుసుకొని ఆబార్షన్ చేయిస్తే, అట్టి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రతి 1000 మంది అబ్బాయిలకు 1050 మంది అమ్మాయిలు రేషియోగా వుండాల్సి వుండగా, జిల్లాలో 905 మంది అమ్మాయిలు మాత్రమే ఉన్నారన్నారు. దత్తత పై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో 2546 మంది వివాహం అయి, 5 సంవత్సరాలు దాటి, పిల్లలు లేనివారు ఉన్నట్లు, ఇట్టివారికి దత్తతపై కౌన్సిలింగ్ ఇచ్చి చైతన్యం తేవాలన్నారు. దత్తతకు దరఖాస్తు చేసుకున్న తర్వాత పిల్లలు కలిగితే, దత్తత రద్దు చెడుకోవచని తెలియజేయాలన్నారు. కారా (సెంట్రల్ ఆడప్షన్ రెగ్యులేషన్ అథారిటీ) ఆమోదం లేకుండా చట్టపరంగా దత్తత చెల్లదన్నారు. బంధువుల పిల్లల దత్తతలో కూడా కారా ద్వారా జరగాలని ఆయన తెలిపారు. ప్రతి సూపర్వైజర్ తమ పరిధిలో కనీసం 5 గురిని దత్తతకు సిద్ధం చేయాలన్నారు. సామ్, మామ్ పిల్లలను గుర్తించి వారికి పౌష్టికాహారం, చికిత్సను అందించి ఆరోగ్యవంతులను చేయాలన్నారు. ఆరోగ్యలక్ష్మి ద్వారా గర్భిణులు, బాలింతలకు ఇచ్చే న్యూట్రిషన్ ఆహారం, కేంద్రానికి వచ్చి తినేలాగా ప్రోత్సహించాలన్నారు. అనీమియా కేసులు గుర్తించిన చోట సరైన పర్యవేక్షణ చేసి, మందులు వేసుకునేలా చూడాలన్నారు. అనీమియా విముక్తి భారత్ క్రింద జిల్లాలోని 22837 మంది 8వ తరగతి నుండి ఇంటర్ అమ్మాయిలకు ఆర్బీఎస్కె బృందం ద్వారా పరీక్షలు నిర్వహించి, తదనుగుణంగా చికిత్స అందించనున్నట్లు ఆయన అన్నారు. ఆరోగ్యలక్ష్మి, ఎస్ఎన్పి క్రింద నమోదులు జరిగేలా చూడాలన్నారు. గర్భిణుల ఏఎన్సి నమోదులు చేపట్టాలన్నారు. బాల్య వివాహాలు జరగకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని అన్నారు. అధికారులు క్షేత్ర స్థాయిలో క్రియాశీలకంగా పనిచేయాలని కలెక్టర్ అన్నారు. ఈ సందర్భంగా చేపట్టిన సంతకాల సేకరణ లో కలెక్టర్ సంతకం చేశారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారిణి డా. బి. మాలతి, జిల్లా సంక్షేమ అధికారిణి సుమ, జిల్లా విద్యాధికారి ఇ. సోమశేఖరశర్మ, వైద్య ఆరోగ్య, స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు.


TEJA NEWS