కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీకి అస్సాం సీఐడీ త్వరలో సమన్లు జారీ చేయనున్నట్లు సమాచారం

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీకి అస్సాం సీఐడీ త్వరలో సమన్లు జారీ చేయనున్నట్లు సమాచారం

TEJA NEWS

గువహటి: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీకి అస్సాం సీఐడీ త్వరలో సమన్లు జారీ చేయనున్నట్లు సమాచారం. ఆయన సారథ్యంలోని ‘భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర’ గత నెల గువహటిలోకి ప్రవేశించిన వేళ పార్టీ కార్యకర్తలు, పోలీసులకు మధ్య ఘర్షణ చోటు చేసుకొంది. దీనిపై రాహుల్‌ను సీఐడీ విచారించనుంది.
ఈ కేసుకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌లో రాహుల్‌తో పాటు సీనియర్‌ నేతలు కేసీ వేణు గోపాల్‌, జితేంద్ర సింగ్‌, జైరాం రమేశ్‌, శ్రీనివాస్‌ బీవీ, కన్హయ్య కుమార్‌, గౌరవ్‌ గొగొయ్‌, భూపేన్‌ కుమార్ బోరా, దేబబ్రత సైకియా పేర్లు కూడా ఉన్నాయి. ఈ కేసుకు సంబంధించి పలువురు నేతలకు ఇప్పటికే సమన్లు జారీ అయ్యాయి. ఎమ్యెల్యే జాకీర్‌ హుస్సేన్‌ సిక్దార్‌తో పాటు మరో పార్టీ నేతకు అస్సాం పోలీసులు సోమవారం నోటీసులిచ్చారు. ఫిబ్రవరి 23న ఉదయం 11.30 గంటలకు గువహటి నగర కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి రామన్‌ కుమార్‌ శర్మను అధికారులు ప్రశ్నించనున్నారు.
కాగా.. జనవరి 23న రాహుల్‌ యాత్ర తొలుత గువహటిలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ట్రాఫిక్‌ కారణాల దృష్ట్యా నగరంలో దీనికి ప్రభుత్వం అనుమతి నిరాకరించి.. బైపాస్‌ నుంచి వెళ్లాలని సూచించింది. ఈ క్రమంలోనే యాత్ర నగరంలోకి ప్రవేశించకుండా పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. అయితే, కాంగ్రెస్‌ కార్యకర్తలు వాటిని తోసుకుని ముందుకు దూసుకెళ్లారు. దీంతో పోలీసులు, పార్టీ నాయకుల మధ్య తోపులాట జరిగింది. కార్యకర్తలను రాహుల్‌ రెచ్చగొట్టారని ఆరోపిస్తూ ఆయనపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ఆదేశించారు. ఈ కేసును ఇటీవల సీఐడీకి బదిలీ చేశారు. ఈ నేపథ్యంలో రాహుల్‌కి సమన్లు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. 

Print Friendly, PDF & Email

TEJA NEWS