‘జమిలి ఎన్నికలు’ రాజ్యాంగ విరుద్ధం.. కమిటీని రద్దు చేయండి: ఖర్గే

‘జమిలి ఎన్నికలు’ రాజ్యాంగ విరుద్ధం.. కమిటీని రద్దు చేయండి: ఖర్గే

TEJA NEWS

Congress: ‘జమిలి ఎన్నికలు’ రాజ్యాంగ విరుద్ధం.. కమిటీని రద్దు చేయండి: ఖర్గే

దిల్లీ: ‘ఒకే దేశం- ఒకే ఎన్నిక (One Nation One Election)’ ఆలోచనను కాంగ్రెస్ (Congress) తీవ్రంగా వ్యతిరేకించింది. రాజ్యాంగ మౌలిక స్వరూపానికి, సమాఖ్య హామీలకు ఇది విరుద్ధంగా ఉందని పేర్కొంది..

జమిలి ఎన్నికలపై అధ్యయనానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రామ్‌నాథ్‌ కోవింద్‌ కమిటీ (Kovind Panel)కి కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) ఈమేరకు లేఖ రాశారు. దేశంలో పటిష్ఠమైన ప్రజాస్వామ్యాన్ని కొనసాగించాలంటే.. ఈ ఆలోచనను విరమించుకోవాలన్నారు. దీనికోసం ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీని రద్దు చేయాలని కోరారు.

“రాజ్యాంగాన్ని, పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసేలా.. కమిటీ ఛైర్మన్‌ తన వ్యక్తిత్వాన్ని, మాజీ రాష్ట్రపతి కార్యాలయాన్ని దుర్వినియోగం చేసేందుకు కేంద్రాన్ని అనుమతించవద్దు. పార్టీ, దేశ ప్రజల తరఫున ఈమేరకు అభ్యర్థిస్తున్నా” అని ఖర్గే పేర్కొన్నారు. ఏకకాలంలో ఎన్నికల వంటి అప్రజాస్వామిక ఆలోచనల ద్వారా ప్రజల దృష్టిని మళ్లించకుండా.. వారి ఆదేశాన్ని గౌరవించేలా ప్రభుత్వం, పార్లమెంట్, ఎన్నికల సంఘం కలిసి పని చేయాలన్నారు. మమతా బెనర్జీ ఆధ్వర్యంలోని టీఎంసీ సైతం ఇటీవల ‘జమిలి’ భావనతో ఏకీభవించడం లేదని స్పష్టం చేసింది.

‘ఒకే దేశం- ఒకే ఎన్నిక’పై అధ్యయనం కోసం గతేడాది సెప్టెంబరులో మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో అత్యున్నత స్థాయి కమిటీ ఏర్పాటైంది. అప్పటినుంచి రెండుసార్లు సమావేశాలు నిర్వహించింది. ఇటీవల ఆరు జాతీయ, 33 ప్రాంతీయ పార్టీల నుంచి అభిప్రాయాలు కోరింది. జమిలి ఎన్నికలపై న్యాయ కమిషన్‌ నుంచి కూడా సలహాలు తీసుకుంది. ప్రజల నుంచి సలహాలు, సూచనలను స్వీకరించింది. ఈ అంశంపై మాజీ ఎన్నికల ప్రధానాధికారులు, హైకోర్టుల మాజీ చీఫ్‌ జస్టిస్‌లతో కమిటీ ఛైర్మన్‌ రామ్‌నాథ్‌ కోవింద్‌ తాజాగా చర్చలు ప్రారంభించారు..

Print Friendly, PDF & Email

TEJA NEWS