TEJA NEWS

స్కూల్ బిల్డింగ్‌లో సీక్రెట్ కెమెరాల కలకలం.. టీచర్లకు కామాంధుడి మేసేజ్‌లు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో సీక్రెట్ కెమెరాలు బయటపడటం కలకలం రేపింది. పాఠశాల బిల్డింగ్‌లోని ఒక గదిలో మహిళా టీచర్లకు కనపడకుండా సీసీ కెమెరాలు ఫిక్స్ చేసినట్లు సమాచారం.

అక్కడ టీచర్లు తమ దుస్తులను సరి చేసుకునేందుకు, తమ సొంత అవసరాల కోసం ఆ గదిని వాడుతుంటారు. ఆ గదిలోనే పాఠశాలకు చెందిన కొన్ని సామాన్లు సైతం భద్రపరుస్తారు. ఆ గదికి పక్కనే మహిళల కోసం అటాచ్డ్ బాత్రూం కూడా ఉంది. ఐదు రోజుల క్రితం పైకప్పు సిలింగ్ ఊడి రెండు కెమెరాలు కిందపడినట్లుగా సమాచారం. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన మహిళా ఉపాధ్యాయులు, రహస్యంగా కెమెరాలను ఎందుకు అమర్చారని యాజమాన్యాన్ని నిలదీయగా తమకు కూడా ఆ విషయం తెలియదని విషయాన్ని చాలా సులువుగా కొట్టిపడేసి, డొంక తిరుగుడు సమాధానం చెప్పారని తెలుస్తోంది.

అన్ని కెమెరాలు టీవీకి, సీక్రెట్ కెమెరా మాత్రం కామంధుడి మొబైల్‌కు లింక్

పాఠశాలలో ఉన్న అన్ని సీసీ కెమెరాలు స్టోర్ రూంలో ఉన్న టీవీకి అనుసంధానమై ఉండగా, అదే గదిలో ఉన్న రెండు సీక్రెట్ సీసీ కెమెరాలు మాత్రం కామంధుడి ఫోన్‌కు లింక్ అయినట్లుగా తెలుస్తోంది. సీక్రెట్ కెమెరాలను గుర్తించిన టీచర్లు, వాటికి కనెక్షన్ ఉన్నట్లుగా కూడా గుర్తించారు. టీవీని అప్పటికప్పుడు చెక్ చేయగా.. సీక్రెట్ కెమెరా కనెక్షన్ మాత్రం టీవీకి లింక్ అయినట్లుగా గుర్తించారు. ఆగ్రహంతో టీచర్లు యాజమాన్యంలోని ఓ మహిళను నిలదీశారు. సదరు మహిళ డొంక తిరుగుడు సమాధానం చెప్పి, మరుసటి రోజుకి అక్కడ సీసీ కెమెరాల ఆనవాళ్లు లేకుండా జాగ్రత్త పడ్డారు.

విషయం బయటికి చెప్పలేక కుంగిపోయిన టీచర్లు

తమ డ్రెస్సింగ్ రూంలో సీక్రెట్ కెమెరాలు బయటపడిన నాటి నుంచి టీచర్లు ఎవరికి బయటికి చెప్పుకోలేక, ఫిర్యాదు చేయలేక తమ పరువు పోతుందేమో అని లోలోపల కుంగిపోతున్నారు. కొందరు టీచర్లు ధైర్యం చేసి విద్యా శాఖ కార్యాలయం దాకా వెళ్లి, అక్కడ సిబ్బందికి మౌఖికంగా ఫిర్యాదు చేసి వచ్చారు. రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తేనే చర్యలు తీసుకుంటామని వారు తెలపడంతో చేసేదేం లేక వెనదిరిగారు. ఇప్పటికే స్కూల్‌లోని ఓ కామాంధుడు బారినపడి గడిచిన రెండేళ్లలో పదుల సంఖ్యలో మహిళా ఉపాధ్యాయినులు ఉద్యోగాలు మానేశారు. చేసేదేమి లేక బయట వివిధ ప్రవేటు పాఠశాల్లో ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్నారు.

నేను కోటీశ్వరుడిని.. డబ్బు పడేసి అన్ని మేనేజ్ చేస్తా..

రహస్య సీసీ కెమెరాల వ్యవహారం బయటపడడంతో కామాంధుడిలో ఓ వైపు పక్క భయం ఉన్నప్పటికీ, పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఏమి తెలియదన్నట్లుగా నటిస్తూ తన వద్ద రూ.కోట్ల కొద్దీ ఆస్తులు ఉన్నాయని, డబ్బుతో ఎవరినైనా మేనేజ్ చేస్తానని ప్రగల్భాలు పలుకుతున్నట్లుగా సమాచారం. రహస్య సీసీ కెమెరాలు బయటపడడంతో అక్కడ ఎటువంటి సాక్షాలు లేకుండా మేనేజ్ చేసి, తిరగబడిన టీచ్లర్లపై బెదిరింపులకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. తిరిగి వారపైనే దొంగతనం అంటగట్టి కేసులు పెడతామని బెదిరించి వారిని బ్లాక్ మెయిల్ చేసి నోరు మూయిస్తున్నాడనే సమాచారం ఉంది. ఆ కామాంధుడు తోలుత ఇంటర్వ్యూలు చేసేటప్పుడే మహిళా ఉపాధ్యాయుల బ్యాక్‌గ్రౌండ్ తెలుసుకుంటాడు. ఆర్థికంగా వెనుకబడిన వారిని, ఒంటరి మహిళలను, తనకు నచ్చినట్లు ఉండే వారిని మాత్రమే ఎంపిక చేసుకుంటాడని టాక్. ఆ పాఠశాల బిల్డింగ్‌లో విధులు నిర్వహిస్తున్న కొంత మంది మహిళా టీచర్లు రకరకాల వేధింపులకు గురవుతున్నట్లు సమాచారం. ఏకంగా ఆ ప్రబుద్ధుడు సదరు టీచర్ల ఫోన్లకు మెసేజ్‌లు చేస్తాడని, స్పందించకపోతే వేధింపులకు గురిచేస్తాడనే ఆరోపణలు ఉన్నాయి. అయితే, అధికారులు ఆ కామంధుడి సెల్‌ఫోన్ రహస్య సీసీ కెమెరాల ఫుటేజ్ స్వాధీనం చేసుకుని విచారణ చేపడితే అసలు వ్యవహారం అంతా బయటకు వస్తుందని ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా ఈ విషయాన్ని ఉన్నతాధికారు పట్టించుకోకపోతే పాఠశాల ఎదుట ఆందోళకు దిగుతామని హెచ్చరిస్తున్నారు.

పాఠశాలలో ఎంఈవో తనిఖీలు..

ప్రైవేటు పాఠశాల బిల్డింగ్‌లో రహస్య సీసీ కెమెరాలు ఉన్నట్లు సమాచారం అందుకున్న చుంచుపల్లి ఎంఈవో పాఠశాల వద్దకు చేరుకుని తనిఖీలు చేపట్టారు. మహిళా టీచర్లతో ఆయన మాట్లాడారు. ఎంఈవో వస్తున్నట్లు ముందే సమాచారం తెలుసుకున్న పాఠశాల యాజమాన్యం సీక్రెట్ సీసీ కెమెరాలు ఆనవాళ్లు లేకుండా చేశారు. తమకు అనుకూలంగా ఉండే కొంతమంది టీచర్లతో ఇక్కడ అలాంటిదేమీ జరగడం లేదని ఎంఈవోకు చెప్పించారు. పాఠశాల బిల్డింగ్‌లో రహస్య సీసీ కెమెరాలు లేనట్లు ఎంఈవోను నమ్మించేందుకు శతవిధాలాగా ప్రయత్నించారు. పోలీసుల రంగ ప్రవేశం చేసి లోతుగా విచారిస్తే తప్ప.. అసలు నిజాలు బయటపడవని పలువురు చర్చించుకుంటున్నారు. సదరు కామాంధుడి ఫోన్‌ను స్వాధీనం చేసుకుంటే సీక్రెట్ సీసీ కెమెరాలు వ్యవహారం, టీచర్లకు మెజేస్‌లు పెట్టి వేధించే వ్యవహారం బయటికి వస్తుందని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.


TEJA NEWS