పిల్లిని కాదు.. పులిలాగా పోరాడే వ్యక్తిని: కేసీఆర్
నల్లగొండ: నల్లగొండ బహిరంగ సభలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అద్దంకి-మర్రిగూడ బైపాస్ వద్ద కృష్ణా జలాల పరిరక్షణకు మంగళవారం నిర్వహించిన సభలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. కాలు విరిగినా కట్టే పట్టుకొని నల్లగొండకు వచ్చానని అన్నారు. ఇది రాజకీయ సభ కాదని.. ఉద్యమ సభ, పోరాట సభగా పేర్కొన్నారు. కృష్ణా జలాల్లో చావో రేవో తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందని అన్నారు. 24 ఏళ్లుగా పక్షిలాగా తిరుగుతూ రాష్ట్రం మొత్తం చెప్పానని గుర్తుచేశారు. నీళ్లు లేకపోతే తెలంగాణ ప్రజలకు బతుకు లేదని చెప్పారు. ఫ్లోరైడ్ వల్ల నల్లగొండ ప్రజల నడుములు వంగిపోయాయని.. ఫ్లోరైడ్ బాధితులను ఢిల్లీకి తీసుకెళ్లి నాటి ప్రధానికి చూపించామని తెలిపారు.
స్వరాష్ట్రం ఏర్పాడ్డాక బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే నల్లగొండలో ఫ్లోరైడ్ సమస్య తీరిందని చెప్పారు. ఇప్పుడు నల్లగొండ ఫ్లోరైడ్ రహిత జిల్లాగా అవతరించిందని అన్నారు. కొందరు ఓట్లు వచ్చినప్పుడే ప్రజల వద్దకు వస్తారని తెలిపారు. కానీ, తాము అలా కాదని నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తులమని చెప్పారు. ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల జీవన్మరణ సమస్య కృష్ణా జలాలు అని వెల్లడించారు. పోరాటం చేసి.. రాష్ట్రం తెచ్చి.. పదేళ్లు పాలించామని అన్నారు. బీఆర్ఎస్ పాలనలో ఎవరికీ తక్కువ చేయలేదని గుర్తుచేశారు. నా ప్రాంత్రం, నా గడ్డ అనే ఆరాటం ఉంటే ఎక్కడివరకైనా పోరాటం చేయవచ్చని అన్నారు.
పక్కనే కృష్ణమ్మ ఉన్నా.. ఫలితం లేకపాయే అనే పాట స్వయంగా తానే రాశానని తెలిపారు. బస్వాపూర్ ప్రాజెక్టు పూర్తయ్యింది.. డిండి ప్రాజెక్టు పూర్తి కావొచ్చిందని అన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులు 80 శాతం పూర్తయ్యాయని తెలిపారు. ఏడాది పాటు తాత్కాలిక ప్రాతిపదికన కృష్ణా జలాలు కేటాయించారని వెల్లడించారు. నాకు చేతనైనా కాకపోయినా.. కట్టే కాలేవరకు తెలంగాణ కోసం పోరాడుతానని ప్రకటించారు. ఎట్టి పరిస్థితుల్లోనైనా తెలంగాణకు అన్యాయం జరుగనివ్వను అని అన్నారు. పులిలాగా పోరాడుతాను తప్పా.. పిల్లిలాగా ఇంట్లో ఉండబోను అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు తెలిసో.. తెలియకో పాలిచ్చే బర్రెను కాదని.. దున్నపోతును ఎన్నుకున్నరని సెటైర్ వేశారు