TEJA NEWS

ఖరీఫ్ ఆశలు ఆవిరి

వరిని దెబ్బతీసిన ఈదురు గాలులు

వరుస తుఫాన్ తో నీట మునిగిన పైర్లు

కోత దశలో పంటకు నష్టం.. రైతాంగం కుదేలు.

సూర్యాపేట జిల్లా : ఆరుగాలం శ్రమించి ఎన్నో వ్యయ ప్రయసాలకోర్చి సాగు చేసిన వరి పంట కోత దశలో నేలమట్టమైంది. గంపెడంత ఆశతో ఉన్న రైతాంగాన్ని ప్రతికూల వాతావరణ పరిస్థితులు దెబ్బతీశాయి. గత 15 రోజులుగా వరుసగా కురుస్తున్న వర్షాలకు చేతికంద వచ్చిన వరి పూర్తిగా రైతాంగం దిక్కు తోచని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. సాగర్ ఆయకట్టులోని వేములపల్లి గ్రామంలో వందలాది ఎకరాల వరి పైరు నేలకు వాలి వ్యవసాయ క్షేత్రంలో నిలిచిన వరద నీటిలో పాచిపోతుంది. మరో వారం పది రోజుల్లో పంట చేతికి వచ్చే అవకాశం ఉండగా ఈ పరిస్థితి ఎదురుపడడంతో రైతాంగం దిక్కుతోచని స్థితిలో పడింది. ప్రతికూల వాతావరణ పరిస్థితులతో దిగుబడులు సైతం తగ్గే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎకరాకు 40 వేల పైగా పెట్టుబడి పెట్టి సాగు చేసిన సన్నాలు చేతికొచ్చే పరిస్థితి లేకపోవడంతో అప్పుల ఊబిలో రైతాంగం తూర్పు పోయే ప్రమాదం ఏర్పడింది.

ఇదిలా ఉంటే కౌరు రైతుల పరిస్థితి మరి అద్వానంగా తయారైంది వ్యవసాయ కార్మికులు కౌలుకు తీసుకున్న భూమిలో సాగుచేసిన వరి పూర్తిగా దెబ్బతీయడంతో ఎటు పాలు పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రభుత్వం పంట నష్ట పరిహారం చెల్లింపు విషయంలో ఎలాంటి స్పష్టమైన ప్రకటన జారీ చేయకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు మరోవైపు వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయి పర్యటన జరిపి పంట నష్టాన్ని అంచనా వేయడంలో విఫలమవుతున్న నేపథ్యంలో రైతులు అధికారుల రాక కోసం ఎదురు చూడాల్సిన దుస్థితి ఏర్పడింది. అధికార ప్రజా ప్రతినిధులు సైతం పంట నష్టాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయకపోవడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ యంత్రాంగం వ్యవసాయ క్షేత్రాలు పర్యటించి పంట నష్టాన్ని అంచనా వేసి ఆర్థికంగా ఆదుకునే ప్రయత్నం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.


TEJA NEWS