Spread the love

కోట‌ప్ప‌కొండ భ‌క్తుల‌కు అసౌర్యం క‌ల‌గ‌కుండా అన్ని ర‌కాల భ‌ధ్ర‌తా చ‌ర్య‌లు
కోట‌ప్పకొండ‌కు వెళ్ల‌టానికి, తిరుగు ప్ర‌యాణానికి రెండు మార్గాలు
భ‌క్తులు పోలీసులు, అధికారుల సూచ‌న‌లు పాటించాలి
రూర‌ల్ సీఐ బి సుబ్బానాయుడు

చిల‌క‌లూరిపేట‌:
భ‌క్తులు కోటి వేల్పుల అండ కోటప్పకొండ.. కోటొక్క ప్రభలు తెచ్చామయ్యా వచ్చి ఏలుకోవయ్యా త్రికోటేశ్వరయ్యా అని మనసారా కోరుకుని స్వామి దర్శనం సౌకర్యంగా జరిగి సుఖంగా తిరుగుముఖం పట్టాలంటే పోలీసుల సూచనలు పాటించాలని రూర‌ల్ సీఐ బి సుబ్బానాయుడు చెప్పారు. మంగ‌ళ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ కోట‌ప్ప‌కొండ తిరునాళ్ల సంద‌ర్బంగా భ‌క్తుల‌కు ఎటువంటి అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా పోలీసు శాఖ అన్ని ర‌కాల చ‌ర్య‌లు చేప‌ట్టింద‌ని వివ‌రించారు.
భ‌క్తులు పోలీసుల సూచ‌న‌లు పాటించాలి
చిల‌క‌లూరిపేట మీదుగా కోట‌ప్ప‌కొండ‌కు చేరుకొనే భ‌క్తుల కోసం ట్రాఫిక్ అవంత‌రాలు ఏర్ప‌డ‌కుండా మార్గ మ‌ధ్యలో ప్ర‌తి చోట పోలీసులు ప‌ర్య‌వేక్ష‌ణ కొన‌సాగుతుంద‌ని వెల్ల‌డించారు. తిరుణాల సందర్భంగా చిలకలూరిపేట ప్రాంతంలో బందోబస్తు నిర్వహించటానికి సుమారు 500 మంది పోలీసు యంత్రాంగం సంసిద్ధంగా ఉందని తెలిపారు. ఇందులో ఇరువురు డిఎస్పీలు 9 మంది సిఐలు 18 మంది ఎస్సైలు విధుల్లో ఉంటారని పేర్కొన్నారు.
కోట‌ప్ప‌కొండ‌కు వెళ్ల‌టానికి, తిరిగి ప‌ట్ట‌ణానికి చేరుకోవ‌డానికి వ‌న్‌వే విధానాన్ని అవ‌లింభిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. చిలకలూరిపేట వైపు నుంచి ఆర్టీసీ బస్సుల్లో వెళ్లే భక్తులు పురుషోత్తపట్నం, యడవల్లి, యూటీ జంక్షన్‌ మీదుగా కోట‌ప్ప‌కొండ ఆర్టీసీ బస్టాండ్‌కు చేరుకోవాలన్నారు. వీఐపీలు యూటీ వద్ద ఏర్పాటు చేసిన పార్కింగ్‌లో వాహనాలు నిలుపుకోవాలని సూచించారు. చిలకలూరిపేట నుంచి వచ్చే ట్రాక్టర్లు, ఇతర వాహనాలు పురుషోత్తపట్నం, యడవల్లి, అట్టల ఫ్యాక్టరీ రోడ్డు నుంచి కట్టుబడివారిపాలెం మీదుగా ప్రభల స్టాండ్‌ వద్దకు చేరుకోవాలన్నారు. తిరుగు ప్రయాణంలో క్రషర్‌ రోడ్డు మీదుగా యూటీ జంక్షన్‌ చేరుకొని కమ్మవారిపాలెం మీదుగా 52 ఎక‌రాల్లో ఉన్న టిడ్కో గృహ స‌ముదాయం మీదుగా చిలకలూరిపేటకు చేరుకోవాలన్నారు. ట్రాఫిక్ కు అంత‌రాయం లేకుండా వాహ‌న‌దారులు పోలీసుల సూచ‌న‌లు పాటించాల‌ని కోరారు.
అప్ర‌మ‌త్తంగా మెల‌గాలి…
తిరునాళ్ల సంద‌ర్బంగా భ‌క్తులు అప్ర‌మ‌త్తంగా మెల‌గాల‌ని సీఐ సుబ్బానాయుడు సూచించారు. పెద్ద ఎత్తున భక్తులు రానున్న నేపథ్యంలో దొంగ‌లు సంచ‌రించే అవ‌కాశం ఉంద‌ని, భ‌క్తులు విలువైన వ‌స్తువుల‌ను జాగ్ర‌త్త చేసుకోవాల‌ని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘ‌ట‌న‌లు జ‌రిగినా వెంట‌నే పోలీసుల దృష్టికి తీసుకురావాల‌ని కోరారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఎప్పటికప్పుడు ఉన్న‌తాధికారుల సూచ‌న‌ల మేర‌కు విధులు నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపారు.