సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై కేటీఆర్ ఘాటు విమర్శలు..
బీఆర్ఎస్ ఎమ్మెల్యే, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై కీలక వ్యాఖ్యలు చేశారు. ట్విటర్ వేదికగా..
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. టీపీసీసీ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ తో కలిసి ఢిల్లీకి వెళ్లారు. ఇవాళ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యాలయంలో జరిగే పార్టీ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో రేవంత్ రెడ్డి, మహేశ్ గౌడ్ పాల్గొననున్నట్లు తెలిసింది. రేవంత్ ఢిల్లీ పర్యటన నేపథ్యంలో క్యాబినెట్ విస్తరణపై ఆశావహులు గంపెడాశలు పెట్టుకున్నారు. ఈ దఫా రేవంత్ ఢిల్లీ పర్యటనలో మంత్రివర్గ విస్తరణపై క్లారిటీ వస్తుందని గాంధీ భవన్ వర్గాలు అంటున్నాయి. అయితే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై కీలక వ్యాఖ్యలు చేశారు. ట్విటర్ వేదికగా విమర్శలు గుప్పించారు.
కేటీఆర్ ట్వీట్ ప్రకారం.. పైసా పనిలేదు.. రాష్ట్రానికి రూపాయి లాభం లేదు. పది నెలల్లో 25 సార్లు రేవంత్ ఢిల్లీ వెళ్లారు. పోను 25సార్లు.. రాను 25 సార్లు.. నీ ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలుచేసి సిల్వర్ జూబ్లీ కూడా చేస్తివి. తట్టా మట్టి తీసింది లేదు.. కొత్తగా చేసింది అసలే లేదు.. అయినానూ పోయి రావలె హస్తినకు.. అంటూ.. సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటనపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. అన్నదాతల అరిగోసలు, గాల్లో దీపాల్లా గురుకులాలు, కుంటుపడ్డ వైద్యం, గాడితప్పిన విద్యా వ్యవస్థ.. అయినను పోయి రావలె హస్తినకు.
మూసీ పేరుతో, హైడ్రా పేరుతో పేదోళ్ల పొట్టలు కొట్టి, 420 హామీలు మడతపెట్టి మూలకు వేశారు. పండుగలకు ఆడబిడ్డల చీరలు అందనేలేవు. అవ్వాతాతలు అనుకున్న పింఛను లేదు. తులం బంగారం జాడనే లేదు.. స్కూటీలు లేవు, కుట్టు మిషిన్లు లేవు.. అయినను పోయి రావాలె హస్తినకు.. అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇదిలాఉంటే.. కేటీఆర్ ట్వీట్ పై కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నారు.