TEJA NEWS

బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణలో రెండు రోజులు మోస్తరు వానలు..!!

హైదరాబాద్ : రాష్ట్రంలో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం రాష్ట్రంపైనా కొంతమేరకు ఉంటుందని పేర్కొన్నది.
ప్రస్తుతం ఈ అల్పపీడనానికి తోడుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, దీంతో రాష్ట్రంలో మోస్తరు వర్షాలు పడే చాన్స్ ఉందని తెలిపింది. ఈ ప్రభావంతో రాష్ట్రంలో మంగళ వారం వాతావరణం మారిపోయింది.

మబ్బులు పట్టి చలిగాలులు వీచాయి. కాగా, వారం రోజుల కింద వణికించిన చలి.. ఇప్పుడు తగ్గుముఖం పట్టింది. ఉత్తరాది జిల్లాలు మినహా దాదాపు రాష్ట్రమంతటా కొన్ని రోజులుగా రాత్రి టెంపరేచర్లు 15 డిగ్రీలకన్నా ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇటు హైదరాబాద్ సిటీలో రాత్రి టెంపరేచర్లు 17 డిగ్రీల కన్నా ఎక్కువగా రికార్డ్ అవుతున్నాయి. మరోవైపు మంగళవారం ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, నల్గొండ జిల్లాల్లో చాలా చోట్ల చిరుజల్లులు కురిశాయి. నల్గొండ జిల్లా మాటూరులో 1.1 సెంటీ మీటర్లు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో 1.1 సెంటీ మీటర్ల మేర వర్షం పడింది.

కుమ్రంభీం జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు

రాత్రి టెంపరేచర్లు ఏడు జిల్లాల్లో 15 డిగ్రీలకన్నా తక్కువగా నమోదయ్యాయి. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, మెదక్ జిల్లాల్లో చలి ప్రభావం కనిపించింది. అత్యల్పంగా కుమ్రంభీం జిల్లా సిర్పూర్లో 12.6 డిగ్రీలు నమోదైంది. సంగారెడ్డి జిల్లా కోహిర్లో 13.2, ఆదిలాబాద్ జిల్లా బేలలో 13.3, వికారాబాద్ జిల్లా మర్పల్లిలో 13.9, నిర్మల్ జిల్లా పెంబిలో 14.3, మెదక్ జిల్లా బోడగట్టులో 14.8, కామారెడ్డి జిల్లా జుక్కల్లో 15 డిగ్రీల మేర రాత్రి ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.

మిగతా అన్ని జిల్లాల్లోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు 15 డిగ్రీలకన్నా ఎక్కువగా నమోదయ్యాయి. హనుమకొండ, మహబూబాబాద్, వరంగల్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో 20 డిగ్రీలకుపైగా రాత్రి ఉష్ణోగ్రతలు నమోదుకాగా.. అత్యధికంగా సూర్యాపేటలో 21.6 డిగ్రీలు రికార్డయింది. నిరుడు ఇదే రోజుతో పోలిస్తే ప్రస్తుతం రాత్రి ఉష్ణోగ్రతలు.. 4 డిగ్రీల నుంచి 7 డిగ్రీల వరకు ఎక్కువగా నమోదు కావడం గమనార్హం. హైదరాబాద్ సిటీలో రెండు రోజుల పాటు రాత్రి ఉష్ణోగ్రతలు 21 డిగ్రీలవరకు నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొన్నది.


TEJA NEWS