ప్రతి విద్యార్థికి ఆంగ్ల భాష పరిజ్ఞానం అందేలా చర్యలు ……
-జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
-మత్తు పదార్థాల అలవాటు పడిన పిల్లలకు కౌన్సెలింగ్
-వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి
-మామిళ్ళగూడెం పాఠశాలలో ఆంగ్ల పాఠ్యాంశం బోధిస్తున్న తీరును పరిశీలించి, విద్యార్థులతో మధ్యాహ్న భోజనం చేసిన జిల్లా కలెక్టర్
ఉమ్మడి ఖమ్మం
ప్రభుత్వ పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థికి ఆంగ్ల పరిజ్ఞానం అందేలా ఉపాధ్యాయులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. మామిళ్ళగూడెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలు ఆంగ్ల పాఠ్యాంశం బోధిస్తున్న తీరును జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తరగతి గదిలో విద్యార్థినులతో కలిసి కూర్చొని పరిశీలించారు. ఆంగ్ల భాష పట్ల భయం అవసరం లేదని, ప్రతిరోజు ఒకరికొకరు కొంత సేపు ఆంగ్లంలో మాట్లాడుకుంటే భాషను సులువుగా నేర్చుకోవచ్చని అన్నారు. కలెక్టర్ విద్యార్థులతో మమేకమై వారిని ఆంగ్లంలో మాట్లాడించి, వారిని చైతన్య పరిచారు. అనంతరం ఉపాధ్యాయులతో సమావేశమై, బోధన ప్రమాణాలు, పాఠశాల సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఆంగ్లం సులువుగా అర్థం చేసుకొని, మాట్లాడే విధంగా యూ కెన్ లెర్న్ స్పోకెన్ ఇంగ్లీష్ కార్యక్రమాన్ని మన ఖమ్మం జిల్లాలో అమలు చేస్తున్నామని అన్నారు. ప్రతి తరగతిలో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారికి సైతం ఆంగ్ల పదాలు సరిగ్గా ఉచ్చరించి మాట్లాడే విధంగా బోధించాలని కలెక్టర్ సూచించారు.
పాఠశాలల్లో 80 శాతం కంటే తక్కువ అటెండెన్స్ ఉన్న విద్యార్థుల వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. హై స్కూల్ చదివే బాలికలకు పీరియడ్స్ టైంలో పాఠశాలకు గైర్హాజరు కాకుండా పాటించాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. బేస్ లైన్ పరీక్షను పక్కాగా నిర్వహించి క్రమపద్ధతిలో విద్యార్థుల ప్రమాణాలు పెంచేలా చూడాలని అన్నారు.
పాఠశాలలో పిల్లల, ఉపాధ్యాయుల హాజరు, నాణ్యమైన భోజనం, పాఠ్యాంశాల బోధన విధానం, తదితర అంశాలపై ప్రత్యేక శ్రద్ద వహించాలని అన్నారు. సాధారణంగా ఉపాధ్యాయులకు బాగా చదివే పిల్లలపై శ్రద్ధ ఉంటుందని, మన పాఠశాలల్లో తరగతి గదులలో వెనుకబడిన విద్యార్థులపై దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు. పాఠశాలలో బాలికల టాయిలెట్ల నిర్వహణ పై శ్రద్ధ వహించాలని, టాయిలెట్లను రెగ్యులర్ గా శుభ్రం చేయాలని అన్నారు. పిల్లలకు చిన్నతనం నుంచి చేతులు కడుక్కునే అలవాటు వచ్చేలా చూడాలని అన్నారు. పాఠశాలల్లో కొంతమంది విద్యార్థులు మందు, మత్తు పదార్థాలకు అలవాటు పడినట్లు గుర్తించామని, వారి తల్లి దండ్రులకు సమాచారం అందించి కౌన్సిలింగ్ ఇచ్చేందుకు ప్రయత్నించినప్పటికీ సఫలీకృతం కాలేదని పాఠశాల హెడ్ మాస్టర్ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకొని వచ్చారు.
పాఠశాలకు పిల్లల హాజరు తక్కువగా ఉందని, రెగ్యులర్ గా పాఠశాలకు వచ్చేలా చూడాలని, పిల్లలను మానిటర్ చేయాలని కలెక్టర్ సూచించారు. మత్తు పదార్థాలకు బానిస పడిన పిల్లలకు వెంటనే కౌన్సెలింగ్ ఇవ్వాలని, ఇది సులువు కానప్పటికీ టీచర్లు కృషి చేయాలని కలెక్టర్ తెలిపారు.
మత్తుకు బానిసైనా విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, మన పిల్లలుగా భావించి ఓపికతో పిల్లలను బాగు చేయాలని, వారికి మత్తు పదార్థాల వల్ల కలిగే నష్టాలను వివరించాలని, క్రీడలు, చదువులో వారిని ప్రోత్సహించాలని కలెక్టర్ సూచించారు. అనంతరం విద్యార్థులతో కలిసి కలెక్టర్ మధ్యాహ్న భోజనం చేశారు. పాఠశాలలో డైనింగ్ హాల్ లేకపోవడం, ప్లే గ్రౌండ్ లేకపోవడంతో ప్రత్యామ్నాయ ప్రదేశానికి ఆలోచన చేయాలన్నారు. పాత డిఆర్డీవో కార్యాలయ భవనాలను కలెక్టర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. భవనాల సద్వినియోగం చర్యలు చేపట్టాలని కలెక్టర్ అన్నారు.
కలెక్టర్ పర్యటన సందర్భంగా శిక్షణ సహాయ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, ఏఎంఓ రవి, పాఠశాల హెచ్ఎం లక్ష్మీ, ఉపాధ్యాయులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.