సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ బహిరంగ లేఖ..!
సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ బహిరంగ లేఖ రాసారు. జర్నలిస్టుల మీద ఎందుకు ఈ వివక్ష అంటూ ఆయన ప్రశ్నించారు. ఎన్నికల్లో చెప్పిందేంటి ఇప్పుడు చేస్తున్నది ఏంటీ.. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల పట్టాలను రద్దు చేయిస్తారా.. చిత్తశుద్ధి ఉంటే ఇళ్లను నిర్మించి ఇవ్వండి.. దసరాకు జర్నలిస్టుల కుటుంబాల్లో పండగ లేకుండా చేస్తారా అంటూ ప్రశ్నించారు.
గత ప్రభుత్వ హయాంలో కేటాయించిన స్థలాలను తమకు స్వాధీనం చేయాలని కోరుతూ కొన్నాళ్లుగా జర్నలిస్టులు ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు. ఇదే సమయంలో తమ సమస్యను పరిష్కరించి, కేటాయించిన స్థలం తమకు స్వాధీనం అయ్యేలా చూడాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ను ఇప్పటికే పలుమార్లు కలిసి వినతి పత్రాలు సమర్పించారు. అయితే, రేపూ.. మాపూ.. అని చెప్పారే తప్ప అధికారులు ఈ సమస్యకు పూర్తి పరిష్కారం చూపలేదు.
ఈ నేపథ్యంలో సోమవారం జర్నలిస్టులు ప్రజావాణికి వెళ్లి మరోసారి కలెక్టర్ పమేలా సత్పతిని కలిసి, తమ స్థలాలు తమకు స్వాధీనం అయ్యేలా చూడాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్, జర్నలిస్టులకు మధ్య కొద్దిసేపు చర్చ నడిచింది. గతంలో కేటాయించిన స్థలాలు ప్రొసీజర్ ప్రకారం లేవని, కనుక రద్దు చేశామని, కొత్తగా వచ్చే నిబంధనలను పరిగణలోకి తీసుకొని ఇండ్ల స్థలాలు ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తామని కలెక్టర్ చెప్పిన మాటలతో కూడిన వాయిస్‌ను జర్నలిస్టులు విడుదల చేశారు. రద్దు అయినట్టు కలెక్టర్ చెప్పడంతో జర్నలిస్టులు ఒక్కసారిగా ఆవేదనకు గురయ్యారు.